రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలతో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఈరోజు, రేపు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. జిల్లాల్లోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకోవడం.. రోడ్లు, రవాణా వ్యవస్థలు స్తంభించడం.. విద్యుత్తు, డ్రైనేజీ వ్యవస్థలకు ఇబ్బందులు ఏర్పడటం వంటి కారణాల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ అవుతుంటుంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు నీటిమట్టం 40 అడుగులకు చేరుకుంది. రామాలయం పడమర మెట్లు, అన్నదాన సత్రం వరకు ఫ్లడ్ వాటర్ చేరింది. అటు కాళేశ్వరం వద్ద ఉభయ నదుల ప్రవాహం భారీగా పెరుగుతోంది. కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి ఎక్కువైంది. జలాశయ నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 691 అడుగులకు చేరుకుంది. 3600 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. ఒక గేటు ద్వారా 2 వేల క్యూసెక్కుల్ని బయటకు వదులుతున్నారు.