సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు వెలువరించిన ఆదేశాలపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా… ఈ రోజు కేసు విచారణకు వచ్చింది. పరువునష్టం కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం కేసు విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులు రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ కేసును వచ్చే నెలకు వాయిదా వేసింది. రాహుల్ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ వీలైనంత త్వరగా పిటిషన్ ను విచారించాలని అభ్యర్థించారు. జైలు శిక్షపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ అనర్హత వల్ల పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడిందని సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే ప్రతివాదుల వాదనలు కూడా వినాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ B.R.గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది.
ప్రధాని మోదీని ఇంటి పేరుతో విమర్శించడంపై గుజరాత్ BJP MLA పూర్ణేశ్ మోదీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేయగా.. విచారించిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడా ఆయనకు చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ కేసులో శిక్ష విధించడం కరెక్టేనని, దీన్ని నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు లేవంటూ హైకోర్టు పేర్కొంది. జైలు శిక్షపై స్టే ఇవ్వకపోవడంతో రాహుల్ పై అనర్హత వేటు కొనసాగుతున్నది.