సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తున్న వాటిలో మరో రాష్ట్రం చేరింది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న పలు రాష్ట్రాల్లో సీబీఐకి నిరాకరణ ఎదురవుతోంది. తాజాగా తమిళనాడు సైతం అదే బాట పట్టింది. మనీ లాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేయడం, దర్యాప్తు సంస్థల్ని వివిధ వ్యవహారాల్లో కేంద్రం ఉసిగొల్పుతోందన్న విమర్శల దృష్ట్యా.. సీబీఐ తమ రాష్ట్రంలో అడుగుపెట్టొద్దంటూ స్టాలిన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 1989, 1992 సంవత్సరాల్లో తమిళనాడు కొన్ని కేసుల విషయంలో సీబీఐకి అనుమతినిచ్చింది. మోదీ ప్రభుత్వం తమపై కేంద్ర సంస్థల్ని ఎగదోస్తుందన్న కారణంతో… గతంలో ఇచ్చిన అనుమతిని తాజాగా ఉపసహరించుకుంది.
ఎనిమిదో రాష్ట్రంగా తమిళనాడు
ఇప్పటికే ఏడు రాష్ట్రాలు కేంద్ర దర్యాప్తు సంస్థకు నో ఎంట్రీ బోర్డు తగిలించాయి. ఇప్పుడు ఈ కూటమిలో తమిళనాడు చేరింది. తెలంగాణతోపాటు ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కేరళ, పంజాబ్, ఛత్తీస్ గఢ్ ఇప్పటికే సీబీఐ ఎంట్రీని నిషేధించాయి. దిల్లీ స్పెషల్ పోలీసు ఎష్టాబ్లిష్ మెంట్ యాక్టు 1946 ప్రకారం… ఏదైనా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయాలని భావిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.