
ఇంగ్లాండ్ బ్యాటర్లు మాస్టర్ క్లాస్ ఆటతో అలరించిన వేళ యాషెస్ నాలుగో టెస్టులో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. అండగా నిలిచే ఆటగాడు లేకపోవడంతో జానీ బెయిర్ స్టోకి సెంచరీ (99 నాటౌట్; 81 బంతుల్లో 10×4, 4×6) చేసే అవకాశం లేకుండా పోయింది. అయినా బెయిర్ స్టో ఉన్నంతసేపు దంచికొట్టాడు. చివరి వికెట్ గా జేమ్స్ అండర్సన్(5) వెనుదిరగడంతో బెయిస్టో సెంచరీ చేయలేకపోయాడు. ఓపెనర్ క్రాలీ డబుల్ సెంచరీ మిస్ కాగా.. బెయిస్టో సైతం సెంచరీ చేజార్చుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ 592 రన్స్ కు ఆలౌట్ కాగా తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ పై 275 రన్స్ లీడ్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా 317 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
384/4తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లీష్ జట్టు.. హ్యారీ బ్రూక్(61; 100 బంతుల్లో 5×4), బెన్ స్టోక్స్(51; 74 బంతుల్లో 5×4) హాఫ్ సెంచరీలతో భారీ స్కోరు దిశగా సాగింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 51 బాల్స్ లోనే 50 రన్స్ చేసిన బెయిర్ స్టో.. అండర్సన్ తో కలిసి చివరి వికెట్ కు 39 బంతుల్లోనే 50 రన్స్ జోడించాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్ 5 వికెట్లు తీసుకోగా.. గ్రీన్, స్టార్క్ 2 వికెట్ల చొప్పున, కమిన్స్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కంగారూలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 32 రన్స్ స్కోరు వద్ద ఖవాజా(18), 54 పరుగుల వద్ద వార్నర్(28) ఔటయ్యారు. స్మిత్(17), హెడ్(1) సైతం వెంటవెంటనే ఔటయ్యారు. థర్డ్ డే ఆట కంప్లీట్ అయ్యేసరికి కంగారూ జట్టు 4 వికెట్లకు 113 పరుగులు చేసింది. లబుషేన్(44), మార్ష్(1) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వుడ్ 3, వోక్స్ 1 వికెట్ తీసుకున్నారు. ఇంగ్లాండ్ స్కోరును సమం చేయడానికి ఆస్ట్రేలియా మరో 165 రన్స్ చేయాలి.