రాష్ట్ర పార్టీలో నెలకొన్న అసంతృప్తులపై BJP హైకమాండ్ దృష్టిసారించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులతో సీనియర్ లీడర్లు సునీల్ బన్సల్, ప్రకాశ్ జవదేకర్ మీట్ అయ్యారు. మాజీ MPలు, MLAలు, MLCలతో వారిద్దరూ చర్చలు జరిపారు. అభిప్రాయాల్ని తీసుకున్నాక.. ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోరుతున్న ఆశావహులు ఇక నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల్ని కలుసుకోవాలని సూచించారు. జనాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ పోరాటం మొదలుపెట్టాలని అన్నారు. మీరు ఏం చెప్పాలనుకున్నా మాకు నేరుగా చెప్పండి.. కానీ అనవసరంగా బయట ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లోటుపాట్లు ఉంటే చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.. వినడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. కానీ బయట మాట్లాడటం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుంది.. ఇకనైనా ఈ అలవాటు మానుకోవాలన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందుబాటులో లేని సమయంలో సీనియర్ లీడర్ ఇంద్రసేనారెడ్డిని కలవొచ్చని బన్సల్, జవదేకర్ లీడర్లకు సూచించారు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించినందుకు సంతోషంగా ఉందని, ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధమంటూ అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటిస్తే బాగుంటుందని మీటింగ్ కు హాజరైన ప్రజాప్రతినిధులు వారిద్దరికీ తెలియజేశారు.