దివ్యాంగులకు పెంచిన పింఛను జులై నుంచే అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. రూ.4,016కు పెంచుతూ కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆసరా స్కీమ్ లో భాగంగా అన్ని కేటగిరీల్లోని దివ్యాంగులకు ఈ పెంపు వర్తిస్తుందని G.O.లో సర్కారు తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ(FAC) నవీన్ మిట్టల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు.
ఈ పెంపు వల్ల 5,11,656 మందికి ప్రయోజనం చేకూరుతుందని సర్కారు అంటున్నది. ఇప్పటివరకు దివ్యాంగులకు నెలకు రూ.3,016 అందుతుండగా మరో రూ.1,000 పెంచడం ద్వారా ఇకనుంచి 4,016 అందబోతున్నది. నెలనెలా రూ.205.48 కోట్లను పింఛను కోసం ప్రభుత్వం కేటాయిస్తున్నది.
CM నిర్ణయంపై మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. పెరిగిన పింఛనుతో దివ్యాంగులకు భద్రతతో కూడిన జీవనం దొరుకుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అత్యధికంగా పింఛను అందిస్తున్నామని గుర్తు చేశారు.