తిరుమల(Tirumala)కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తితిదే(TTD) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇంటర్నేషనల్ టెంపుల్స్ మీటింగ్ లో భాగంగా వారణాసి టూర్ లో ఈ విషయాల్ని పంచుకున్నారు. దేశవ్యాప్తంగా తితిదే 71 ఆలయాల్ని నిర్వహిస్తోందని, శ్రీవారికి ఏడాదికి 500 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నామన్నారు. శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాలు 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉంటుందని తెలిపారు. తితిదే పరిధిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం, ఆలయంలో ప్రసాదాల తయారీకి ఏటా 500 టన్నుల నెయ్యి ఉపయోగిస్తామన్నారు. 24,500 మంది ఉద్యోగులున్నారని, భక్తులకు సేవలు అందించడానికి నిత్యం 800 మంది సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు.
స్వామి వారి పేరుతో 17 వేల కోట్ల నగదు, 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్ చేశామని ధర్మారెడ్డి తెలిపారు. 30 దేశాల నుంచి వచ్చిన 1600 మంది సమక్షంలో తితిదే వివరాల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో వివరించారు.