దళిత బంధు, బీసీ కులవృత్తులకు లక్ష రూపాయల సాయం స్కీమ్ లు అందిస్తున్న KCR సర్కారు మైనార్టీలకు సాయం అందించాలని నిర్ణయించింది. మైనార్టీ వర్గాలకు రూ.1,00000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్థిక సాయం పథకంపై ఉత్తర్వులు జారీ చేస్తూ CM నిర్ణయం తీసుకున్నారు. పూర్తి సబ్సిడీతో ఈ నిధుల్ని అందిస్తామని సీఎం వివరించారు. కులమతాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్ అన్నారు. తమకూ సాయం ప్రకటించాలని ఇప్పటికే పలు ముస్లిం మైనార్టీ సంఘాలు సీఎంను కోరాయి. దీంతో KCR వారికి సైతం రూ.లక్ష అందించాలని ఆదేశించడంతో మైనార్టీ సంక్షేమ శాఖ ఆర్డర్స్ రిలీజ్ చేసింది. బ్యాంకులతో సంబంధం లేకుండా పూర్తిగా 100 శాతం రాయితీతో మైనార్టీ వర్గాలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ సాయాన్ని అందివ్వాలని తీర్మానించింది.
BC చేతివృత్తులకు ఇచ్చే పథకానికి వర్తించే విధివిధానాలే దీనికీ అమలవుతాయని, నిరుపేదలకు ఈ పథకం అందేలా చూడాలని KCR ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం రూరల్ ఏరియాల్లో లక్షన్నర లోపు వార్షికాదాయం ఉన్నవారు దీనికి అర్హులవుతారు. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయం లోపు ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇందుకు తగిన సమయమిచ్చి ఆ లోపు అప్లికేషన్లు తీసుకోవాలని స్పష్టం చేసింది. వాటిని పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు రూ.లక్ష అందించాలని ఆదేశాల్లో పేర్కొంది.