నూతన పెన్షన్ విధానాన్ని(NPS) రద్దు చేసి పాత పెన్షన్(OPS)ను పునరుద్ధరించాలని జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(JFROPS) డిమాండ్ చేసింది. రైల్వే, బ్యాంకింగ్, బీమాతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ లోని వివిధ సంఘాలు కలిసి JFROPSగా ఏర్పడ్డాయి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రోగ్రాంకు MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. OPS కోసం జాతీయ స్థాయిలో విశాల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. NPSను BJP సర్కారు 2004 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చిందని, ఉమ్మడి APలో 2004 సెప్టెంబరు నుంచి దీన్ని వర్తింపజేస్తున్న ఈ స్కీంలో 1.75 కోట్ల మందిని బలవంతంగా నెట్టేశారని నేతలు మండిపడ్డారు. దేశంలో 14 కోట్ల మందికి సామాజిక భద్రత కల్పించే వ్యవస్థ లేదని, భారీగా పెరిగిన ధరల వల్ల ఉద్యోగులు నష్టపోతే కార్పొరేట్లు మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. అయినా సబ్సిడీలు పొందుతూ దేశ సంపదను కొల్లగొడుతున్నారని ఫైర్ అయ్యారు.
జాతీయ స్థాయిలో పోరాటాలకు తీర్మానం
అలాంటి కార్పొరేట్లు తమ సంపాదనలో ఒక్క శాతం పన్ను కట్టినా దేశంలోని కార్మికులు, ఉద్యోగులందరికీ పెన్షన్ అందించవచ్చన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఇలాంటివి పట్టించుకునే స్థితిలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోరాట కార్యక్రమాలు చేపట్టాలని సదస్సు తీర్మానించింది. రాష్ట్రం నుంచి ఉద్యోగులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది. TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, TPTF అధ్యక్షుడు వై.అశోక్ కుమార్, DTF అధ్యక్షుడు ఎం.సోమయ్య, TRTF అధ్యక్షుడు కె.అశోక్ కుమార్, సీహెచ్ శంకర్ రావు(SCRMU), శ్రీకాంత్ గౌడ్(డిఫెన్స్), జి.తిరుపతి(LIC), శ్రావణ్ కుమార్(పోస్టల్), సతీశ్ బాబు(రూరల్ బ్యాంక్స్) తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి బి.కొండయ్య, షౌకత్ అలీ, కె.సురేశ్, యు.పోచయ్య, ఎన్.యాదగిరి, వై.విజయ్ కుమార్, టి.లింగారెడ్డి, కె.జంగయ్య, పి.నాగిరెడ్డి, కె.రమేశ్ హాజరయ్యారు.