
పుట్టినరోజు నాడు అనాథ పిల్లలకు సహాయం చేయాలని మంత్రి కేటీ రామారావు డిసైడ్ అయ్యారు. అనవసరంగా హంగామా చేసి ఖర్చులు పెట్టే బదులు ఆ డబ్బులతో పేద పిల్లలను ఆదుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. తన 47వ బర్త్ డే నాడు 47 మంది పిల్లలను ఆదుకుంటానని చెప్పారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని పిల్లలకు అండగా ఉంటానన్న భరోసానిచ్చారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ 47 మందిని గుర్తించి వారికి చేయాతనిస్తానని ట్విటర్ లో ప్రకటించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి మరో 47 మందిని చదివిస్తానని మొత్తంగా 94 మందికి అండగా ఉంటానని ప్రకటించారు.
అందరికీ ల్యాప్ టాప్ లు
‘గిఫ్ట్ ఏ స్మైల్ కింద’ ఆ 47 మంది పిల్లలకు ల్యాప్ టాప్ లు అందిస్తానని కేటీఆర్ తెలిపారు. రెండేళ్ల పాటు ఆ స్టూడెంట్స్ కోచింగ్ బాధ్యతలు తీసుకుంటానని, అనవసరంగా ప్రకటనల(యాడ్స్) పేరుతో చేసే ఖర్చును అనాథ పిల్లలకు కేటాయిస్తే బాగుంటుందని పార్టీ నేతలకు వివరించారు.