మణిపూర్(Manipur) అల్లర్లు, జాతి ఘర్షణలపై మోదీ పెదవి విప్పాలంటూ.. వీటిపై ఆయన ప్రకటన చేయాలంటూ పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు రెండు సభలు మొదలయ్యాయి. సభలు మొదలవుతుండగానే విపక్ష MPల కంటిన్యూ ఆందోళనతో ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్.. రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు లోక్ సభ ప్రారంభం కాగానే అక్కడా విపక్ష కూటమికి చెందిన వివిధ పార్టీల MPలు గట్టిగా నినాదాలు చేశారు. మణిపూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇండియా ఫర్ మణిపూర్’ అంటూ ప్లకార్డులు చేతపట్టుకుని స్లోగన్స్ ఇచ్చారు.
మణిపూర్ అల్లర్లపై జరిగే చర్చకు సహకరించాలని అంతకుముందు ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభ్యర్థించినా ఫలితం కనపడలేదు. ప్రతిపక్షాలు ఎందుకు నిర్మాణాత్మక చర్చ నుంచి తప్పుకుంటున్నాయో అర్థం కావడం లేదని జోషి అన్నారు.