దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్సెస్ ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ(Heavy) నుంచి అతి భారీ(Very Heavy) వర్షాలు నమోదయ్యే అవకాశముందని ప్రకటించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. రేపు పొద్దున 8:30 నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు 24 గంటల వ్యవధిలో ఈ వర్షాలు ఉండనున్నాయని చెప్పింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది.
అతి భారీ వర్షాలు గల మిగతా జిల్లాలు…
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయన్న వాతావరణ కేంద్రం.. ఈ ఏడు జల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలైన జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది.