మూడు రోజులుగా పడుతున్న ఎడతెరిపిలేని వర్షా లతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. భాగ్యనగరంలో అన్ని రూట్లు వాటర్ తో నిండిపోయాయి. ఉప్పల్-వరంగల్ రూట్ లోని రోడ్డుపై పెద్దయెత్తు వరద నీరు పారడంతో వెహికిల్స్ చిక్కుకుపోయాయి. అన్ని మెయిన్ ఏరియాల్లోనూ రోడ్లు కాల్వల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వస్తోంది. శివారు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మాదాపూర్, ఖైరతాబాద్, ఉప్పల్, సికింద్రాబాద్, మియాపూర్ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ వర్షానికి బయటకు రావద్దని GHMC హెచ్చరిస్తున్నా.. ఆఫీసులకు వెళ్లాల్సి రావడంతో ఉద్యోగుల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది.
మెట్రోను ఆశ్రయిస్తున్న జనం
రోడ్లపై వెహికిల్స్ తిరిగే పరిస్థితి లేకపోవడంతో జనం మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అన్ని ఏరియాల్లో మెట్రో రైళ్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది. రోడ్లపై గంటలకు గంటలు జర్నీ చేసే బదులు అనుకున్న సమయానికి చేరవేసే మెట్రోనే మేలని అనుకుంటూ భారీగా స్టేషన్లకు చేరుకుంటున్నారు.