
ప్రతి ప్రయోగంలోనూ వినువీధిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడించిన ఇస్రో ఇప్పుడు మరో మైలురాయికి సిద్ధమైంది. భారీ ఉపగ్రహ ప్రయోగాలకు ఫ్రాన్స్, అమెరికా సాయం అవసరం లేదని చాటిచెబుతూ దేశీయ ఎల్వీఎం-3 రాకెట్ నింగిలోకి దూసుకు పోనుంది. ఇస్రో(ISRO) ప్రయోగించే 4,140 కిలోల CMC-3 బాహుబలి ఉపగ్రహం రాకెట్పరంగానే కాక రక్షణ, వ్యూహాత్మక పహారాలో గేమ్‌ఛేంజర్ కానుంది. ప్రధానంగా శత్రు దేశాల యుద్ద నౌకలు, జలాంతర్గాములపై డేగకన్ను నావికాదళం ఉంచనుంది. ఇంతటి కీలకమైన విధుల కోసం పూర్తి స్వదేశీ సాంకేతికతతోనే ఈ రాకెట్, ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది ఇస్రో. అందుకే నేటి LVM-3 ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనతోపాటు రక్షణ రంగంలో సరికొత్త శకానికి నాంది అంటున్నారు నిపుణులు.