సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇలాంటి ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే ఎంతో ధైర్యం కావాలి. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి టాప్ స్టార్స్ గా ఎదిగిన వాళ్లలో చాలా మంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారే ఉంటారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నాయికలు రాజ కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వివిధ సంస్థానాలకు చెందిన ఈ రమణీమణులు.. బాలీవుడ్ సామ్రాజ్యాన్ని ఏలారు. కొంతమంది ఇప్పటికీ ఏలుతున్నారు.
తన అందం, నటనాచాతుర్యంతో బాలీవుడ్ సినీప్రియుల గుండెల్లో గూడు కట్టుకున్న పర్వీన్ బాబీ.. జునాగఢ్ రాజవంశానికి చెందిన అమ్మాయి. 1970, 80ల్లో ఊపు ఊపేసిన పర్వీన్.. ఆ రోజుల్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా నిలిచారు. 1973లో ‘చరిత్ర’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాబీ.. ‘కాలియా’, ‘ఖుద్దర్’, ‘రజియా సుల్తానా’, ‘అబ్దుల్లా’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ‘మైనే ప్యార్ కియా’తో దేశ సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించిన భాగ్యశ్రీ.. పట్వాడ్ ధాన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మహారాష్ట్రలోని సాంగ్లీకి కేంద్రంగా వీరి ముత్తాతలు పాలన సాగించారు. వెండితెరతోపాటు టెలివిజన్ షోల్లోనూ భాగ్యశ్రీ మెరిసింది.
రియాసేన్ షాయాజీరావ్ గైక్వాడ్ 3 సంస్థానానికి చెందినవారు. ఈమె బామ్మ ఇలాదేవి షాయాజీరావు కుమార్తె. చక్ దే ఇండియా గర్ల్ సాగరికా ఘట్గే మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన సాహూ మహరాజ్ వంశానికి చెందిన యువరాణి. మంచి గుర్తింపు పొందిన మనీషా కొయిరాలా నేపాల్ రాయల్ కొయిరాలా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఆమె తాత, తండ్రితోపాటు ఫ్యామిలీ మెంబర్స్ సైతం అక్కడి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన అదితిరావ్ హైదరీ బాలీవుడ్ లో ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లోని మణిపురి రాజ్ పుత్ ఫ్యామిలీ మెంబర్ సోనాల్ చౌహాన్.