ఎడతెరిపిలేకుండా కంటిన్యూగా కురుస్తున్న వర్షా లు జిల్లాల్లో భయానకంగా తయారయ్యాయి. ఇంచుమించు అన్ని జిల్లాల్లోని చెరువులు నిండిపోగా.. ప్రాజెక్టులకు ఫ్లడ్ వాటర్ పెద్దయెత్తున వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా నీరు వస్తోంది. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గతేడాది మాదిరిగానే ఈ సారి సైతం కెపాసిటీకి మించి వాటర్ వచ్చి చేరుతోంది. 3.54 లక్షల క్యూసెక్కుల కెపాసిటీ ఉండగా.. 3.87 లక్షల ఇన్ ఫ్లో ఉంటోంది. 14 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులకు గాను పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని ప్రస్తుతం ఇంచుమించు 700 అడుగులకు చేరుకుంది. వచ్చిన నీటినంతా వదిలిపెడుతున్నా పెరుగుతున్న వరద భయానికి గురిచేస్తోంది.
నేరెళ్ల పసుల పాపన్నగుట్ట వద్ద రోడ్డుపై వాగు పారడంతో జగిత్యాల-మంచిర్యాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా.. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.