
24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. ఇంతకుముందెన్నడూ లేని విధంగా రెయిన్ ఫాల్ రికార్డు అవుతుండటంతో పల్లెలు నీటి కుంటలుగా మారుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో 36.5 సెంటీమీటర్ల మేర వాన పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో 36.2 సెంటీమీటర్లు రికార్డయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో 30.2, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 24.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓల్డ్ కొత్తగూడెంలో 23.7, వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో 22.4, జనగామ జిల్లా జాఫర్ గఢ్ మండల కేంద్రంలో 21.3 సెంటీమీటర్ల రెయిన్ ఫాల్ రికార్డయింది.
ఇలా ఒక్క రోజు వ్యవధిలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడటంతో ఆయా ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. గత రెండ్రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇదే తీరు కనపడింది. హయ్యెస్ట్(Highest) రెయిన్ ఫాల్స్ రికార్డు కావడంతో సహాయక చర్యలు చేపట్టలేని దురవస్థ నెలకొంది.