
పశ్చిమాసియా యుద్ధంతో అన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయి. ధనిక దేశాలని చెప్పే జర్మనీలో 18%, స్పెయిన్ లో 34% పెరగ్గా, ఆఫ్రికాలో 30% నుంచి 50% వరకు ఎగబాకాయి. మరి 88% దిగుమతులపైనే ఆధారపడే భారత్ లో ధరలెందుకు పెరగలేదు. భారత ఇంధన దిగుమతులు ఆదిలోనే మొత్తంగా 3.22 లక్షల నుంచి 2.65 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. గల్ఫ్ వాటా 60% నుంచి 34%నికి పడిపోయి పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి తీవ్ర కొరత ఏర్పడింది. గల్ఫ్ ను పక్కనపెట్టి సమీప దేశాల నుంచి తెచ్చుకుందామంటే హార్ముజ్ మూసేశారు. ఇది గమనించి ముందుగానే భారత్ .. ఏటా 2.2 మిలియన్ టన్నులు పంపేలా అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఈ నిర్ణయమే 10% ఎల్పీజీ కొరతను తీర్చింది.
ఫిబ్రవరి 28న ఇరాన్ పై యుద్ధం మొదలైంది. ఈ 37 రోజుల్లో రష్యా నుంచి 45-50 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం వచ్చింది. రోజుకు మిలియన్ బ్యారెళ్ల కన్నా కొంచెం ఎక్కువన్నమాట. కానీ ఈ టార్గెట్ ను రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లుగా పెట్టుకుంది మోదీ సర్కారు. తమ రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడి చేయడంతో యూరప్ సహా అన్ని దేశాలకు ఎగుమతులు ఆపేసింది రష్యా. కానీ ఒక్క భారత్ కు మాత్రం ఆపకపోవడంతో మన బఫర్ స్టాక్ పెరిగింది.
హార్ముజ్ క్లోజ్ అవుతుందని, గల్ఫ్ నుంచి ఆయిల్ రాదని భావించిన భారత్.. ఆఫ్రికా దేశాలపై కన్నేసింది. నైజీరియా, అంగోలా, అట్లాంటిక్ బేసిన్ నుంచి ప్రత్యామ్నాయం చూసుకుని.. హార్ముజ్, ఎర్ర సముద్రాన్ని వదిలేసి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మార్గం ద్వారా లైన్ క్లియర్ చేసుకుంది. సుదీర్ఘ ప్రయాణంతో 40-60% ఖర్చులు పెరిగినా నిరంతర దిగుమతులు ఆగలేదు. అన్ని దేశాలకు హార్ముజ్ మూతపడితే, నేవీ దౌత్యంతో మన సరఫరా నిలిచిపోలేదు.
పీఎన్జీ కొత్త కనెక్షన్లు 2.9 లక్షలకు చేరడం, ముందస్తు వ్యూహాలతో ఎల్పీజీ 28% పెరిగింది. దీంతో 60 రోజుల నిల్వలు కాస్తా 74 రోజులకు చేరాయి. అంతర్జాతీయ ధరల ప్రభావం నేరుగా ప్రజలపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.2.40 లక్షల కోట్ల నష్టాన్ని భరిస్తే, కేంద్రం రూ.2.30 లక్షల కోట్ల పరిహారాన్ని అందించింది. పెట్రోలు, డీజిల్ పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో చిల్లర ధరలపై ప్రభావం పడలేదు.