
అసలే జోరు వానలు… నీట మునిగిన ఊళ్లు… అడుగుతీసి అడుగువేసే అవకాశం లేదు.. అలాంటి కష్టాల్లో చిన్నారులు పడుతున్న వేదన దయనీయం. ఖమ్మం జిల్లా మున్నేరు ఫ్లడ్ లో చిక్కుకున్న రెండు కుటుంబాల పరిస్థితి ఇది. ఖమ్మం పద్మావతి నగర్ లో ఇళ్లను ఫ్లడ్ వాటర్ చుట్టుముట్టడంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు ఇళ్లల్లో 12 మంది చిక్కుకుపోయారు. చలికి వణుకుతూ క్షణం క్షణం ప్రాణ భయంతో కాలం గడుపుతున్నారు. ఆరు నెలల పసిపాప కూడా ఒక ఇంట్లో ఉండిపోయింది. ఆ చిన్నారితో వారు అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతం. ఇళ్ల నుంచి బయటకు రాలేక.. అలా నాలుగు గంటల పాటు ఎదురుచూస్తూనే ఉన్నారు.
వరద ప్రభావంతో ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు NDRF టీమ్ అక్కడకు చేరుకుంది. వారందర్నీ బోట్లలో తీసుకువచ్చేందుకు NDRF టీమ్ బోట్లు ఏర్పాటు చేసింది. మున్నేరుకు వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అక్కడి రెస్క్యూ టీమ్ కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫ్లడ్ ఇంకా పెరుగుతూ ఉండటంతో అక్కడివారిలో భయం కనిపిస్తోంది.