
పాలిటిక్స్ లో ఎంట్రీ గనుక ఇస్తే ఏ పార్టీ నుంచి అయినా MPగా గెలుస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. రాజకీయాల్లోకి అడుగు పెడితే చాలు విజయం సాధిస్తానన్నారు. అయితే సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మాట్లాడారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న రాజు.. ఆదివారం ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా తన ప్యానెల్ తో మీడియాతో మాట్లాడారు. అయితే తన ఫస్ట్ ప్రయారిటీ సినిమా రంగానికేనని అన్నారు. గతంలో సీనియర్లు ముందుకు వస్తే ఏకగ్రీవంగా ఎన్నుకునే వారని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని గుర్తు చేశారు. సీనియర్లెవరూ ముందుకు రాకపోవడంతోనే తాను బరిలోకి దిగినట్లు ఆయన స్పష్టం చేశారు.
సినీ ఇండస్ట్రీ డెవలప్ మెంట్, వెల్ఫేర్ కోసమే పోటీ చేస్తున్నానని, ఎన్నికైనా పెద్దగా కిరీటాలేం పెట్టబోరని కామెంట్స్ చేశారు. తాను గెలిస్తే ఫిల్మ్ ఛాంబర్ బై లాస్ ఛేంజ్ చేస్తానని, తద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ మెంట్ దిశగా తీసుకెళ్తానని అన్నారు. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రెసిడెంట్ పదవికి సి.కల్యాణ్ ప్యానెల్ తో దిల్ రాజు ప్యానెల్ పోటీ పడుతున్నది. సాయంత్రం 6 గంటలకు కొత్త అధ్యక్షుడి ప్రకటన వెలువడుతుంది.