యాషెస్ సిరీస్ లో నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న చివరి టెస్టుకు మళ్లీ వరుణుడు అడ్డు పడ్డాడు. నాలుగో రోజు సగం ఓవర్లు కూడా ఆడకుండానే ఆటను ముగించారు. ఇంగ్లండ్ కు 10 వికెట్లు అవసరం కాగా.. ఆస్ట్రేలియా గెలవాలంటే మరో 249 రన్స్ చేయాలి. 389/9తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన స్టోక్స్ సేన.. మరో 6 రన్స్ చేసి చివరి వికెట్ కోల్పోయింది. లీడ్ 12 పరుగులు పోను 384 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు వార్నర్(58 నాటౌట్; 99 బంతుల్లో 9×4), ఖవాజా(69 నాటౌట్; 130 బంతుల్లో 8×4) క్రీజులో ఉన్నారు. వర్షం వచ్చే సమయానికి ఆస్ట్రేలియా 38 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 135 పరుగులు చేసింది.
లంచ్ సమయానికి 25 ఓవర్లలో 75/0తో ఉన్న ఆసీస్ జట్టు.. 135/0 టీ బ్రేక్ కు వెళ్లింది. కానీ ఆ తర్వాత వర్షం పడటంతో ఆటగాళ్లు మళ్లీ గ్రౌండ్ కి రాలేకపోయారు. వర్షం తెరిపినిచ్చినా గ్రౌండ్ తడిగా ఉండటంతో అంపైర్లు నాలుగో రోజు ఆటను నిలిపివేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 283 రన్స్ చేయగా, కంగారూ జట్టు 295 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ జట్టు 395 పరుగులు చేసింది. నాలుగో టెస్టులో గెలుపు దిశగా ఇంగ్లండ్ దూసుకెళ్తున్న సమయంలో వర్షం పడి మ్యాచ్ ను డ్రాగా ముగించేలా చేసింది.