లంబాడీలపై MP సోయం బాపూరావు చేసిన కామెంట్స్ వివాదానికి దారితీస్తున్నాయి. ఈ మాటలతో BJP ఇరకాటంలో పడినట్లే కనిపిస్తోంది. అందుకే దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సోయం బాపూరావు కామెంట్స్ తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి అన్నారు. గిరిజన రిజర్వేషన్లపై సోయం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు. ‘బాపూరావు మాట్లాడిన మాటలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.. దీనిపై మేం వివరణ కోరుతున్నాం.. లంబాడీలకు రిజర్వేషన్లపై కమలం పార్టీ కట్టుబడి ఉంటుంది’ అని అన్నారు.
అధికారంలోకి రాగానే లంబాడీలను ఆదుకుంటామని కిషన్ రెడ్డి వివరించారు. గిరిజన రిజర్వేషన్ల అంశంపై తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇవే వ్యాఖ్యలపై రెండ్రోజుల క్రితం కూడా కిషన్ రెడ్డి స్పందించారు. అప్పుడు కూడా ఈ మాటలతో పార్టీకి సంబంధం లేదని తెలిపారు. అసలే ఎన్నికల సమయం. ఇలా వివాదాస్పదంగా మాట్లాడితే ఎలా అన్న భావన పార్టీలో కనిపిస్తోంది. కానీ లంబాడీల రిజర్వేషన్లపై చులకనగా మాట్లాడిన విధానం హాట్ హాట్ గా మారింది. దీంతో మరోసారి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.