యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ అద్భుత విజయంసాధించింది. ఉత్కంఠభరిత పోరులో 49 రన్స్ తేడాతో గెలుపొంది 5 టెస్టుల సిరీస్ ను 2-2తో సమం చేసింది. 384 రన్స్ టార్గెట్ తో ఐదోరోజు 135/0తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 334 రన్స్ కు ఆలౌట్ అయింది. నాలుగో రోజు సగానికి పైగా ఆట తుడిచిపెట్టుకుపోయినా.. చివరి రోజు మాత్రం ఇంగ్లండ్ పట్టువిడవలేదు. ఆ జట్టులో ఉస్మాన్ ఖవాజా(72; 145 బంతుల్లో 8×4), వార్నర్(60; 106 బంతుల్లో 9×4), స్మిత్(54; 94 బంతుల్లో 9×4) హాఫ్ సెంచరీలు చేసినా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. లబుషేన్(13), హెడ్(43), మార్ష్(6), క్యారీ(28) పరుగులకు ఔట్ అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/50) మరోసారి సత్తా చాటగా.. మొయిన్ అలీ 3, స్టూవర్ట్ బ్రాడ్ 2 వికెట్లు తీశారు. మరో వికెట్ ను మార్క్ వుడ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 283, ఆసీస్ 285 రన్స్ చేయగా.. సెకండ్ ఇన్నింగ్స్ లో స్టోక్స్ సేన 395 రన్స్ సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన క్రిస్ వోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ను సైతం మిచెల్ స్టార్క్ తో కలిసి పంచుకున్నాడు. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలుపొందగా.. మూడో టెస్టులో ఇంగ్లండ్ నెగ్గింది. నాలుగోది డ్రాగా ముగిసింది.