చివరి వన్డేలో భారీ ఆధిక్యంతో భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ ను తక్కువ స్కోరుకే మట్టికరిపించి సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. 50 ఓవర్లలో 351/5 పరుగుల భారీ స్కో రు చేసిన భారత్.. విండీస్ ను 35.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌట్ చేసి 200 పరుగులతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ఇషాన్ కిషన్(77; 64 బంతుల్లో, 8×4, 3×6), శుభ్ మన్ గిల్(85; 92 బంతుల్లో, 11×4) శుభారంభం అందించారు. 47 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఈ జోడీ.. 13.2 ఓవర్లలోనే 100 మార్క్ కు చేరుకుంది. వీరిద్దరూ ఫస్ట్ వికెట్ కు 143 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదు చేశారు. రుతురాజ్ గైక్వాడ్(8) నిరాశపరచగా, సంజు శాంసన్(51; 41 బంతుల్లో, 2×4, 4×6) మెరుపులు మెరిపించాడు. హార్టిక్ పాండ్య(70 నాటౌట్; 52 బంతుల్లో, 4×4, 5×6) సైతం విండీస్ కు చుక్కలు చూపించాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్(35; 30 బంతుల్లో, 2×4, 2×6)లతో రాణించాడు. కరీబియన్ బౌలర్లలో షెఫర్డ్ 2, జోసెఫ్, మోటీ, కేరియా తలో వికెట్ తీసుకున్నారు.
352 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆతిథ్య జట్టును ఫాస్ట్ బౌలర్లు ఆటాడుకున్నారు. శార్దూల్ ఠాకూర్(4/37), ముకేశ్ కుమార్(3/30) విండీస్ వెన్నువిరిచారు. 7 పరుగుల స్కోరుకే రెండు వికెట్లు కోల్పోగా.. ఆ వికెట్లను ముకేశ్ కుమార్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఏ దశలోనూ ఆ జట్టు భారత్ కు పోటీ ఇవ్వలేకపోయింది. పదో నంబర్ బ్యాటర్ గా వచ్చిన గుడకేశ్ మోటీయే(39) హయ్యెస్ట్ స్కోరర్. అథనేజ్(32), జోసెఫ్(26) ఈ మాత్రమైనా స్కోరు సాధించారు. మిగతా వారంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. 88 రన్స్ కే 8 వికెట్లు కోల్పోయిన విండీస్.. 100 లోపే ఆలౌట్ అవుతుందేమో అనిపించింది. కానీ కేరియా(19), జోసెఫ్(26), గుడకేశ్(39) పోరాటంతో ఆ స్కోరైనా సాధించగలిగింది. తొలి వన్డేలో భారత్ నెగ్గగా, రెండో వన్డేలో కరీబియన్ జట్టు విజయం సాధించింది. టోర్నీ నిర్ణయాత్మక మ్యాచ్ లో గెలుపొంది టీమ్ ఇండియా 2-1తో సిరీస్ ను చేజిక్కించుకుంది. శుభ్ మన్ గిల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కగా.. ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.