తొలి టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రతిభతో భారత్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసి సంచలన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం 20 ఓవర్లలో 145/9కి భారత్ కు బ్రేక్ వేసి 4 రన్స్ తేడాతో గెలుపొందింది.
రోమన్ పావెల్(48; 32 బంతుల్లో 3×4, 3×6) ఆ జట్టులో అత్యధిక స్కోరర్. మంచి ఫామ్ లో ఉన్న నికోలస్ పూరన్(41; 34 బంతుల్లో 2×4, 2×6) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆతిథ్య జట్టు 149 రన్స్ కే పరిమితమైంది. ఓపెనర్ బ్రెండన్ కింగ్(28), కైల్ మయర్స్(1), జాన్సన్ ఛార్లెస్(3), హెట్ మయర్(10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్(2/24), అర్షదీప్ సింగ్(2/31) వికెట్లు తీయగా హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
మామూలు స్కోరే కదా మనోళ్లు కొట్టేస్తారులే అని అనుకుంటే చివరి వరకు పోరాటం చేయాల్సి వచ్చింది. వన్డే టోర్నీలో అన్ని మ్యాచ్ ల్లో రాణించిన ఓపెనర్ ఇషాన్ కిషన్(6) రన్స్ కే వెనుదిరగ్గా, గిల్(3) సైతం ఇషాన్ బాటనే ఫాలో అయ్యాడు. 28కే 2 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను సూర్య(21; 21 బంతుల్లో 2×4, 1×6), తిలక్ వర్మ(39; 22 బంతుల్లో 2×4, 3×6) ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తిలక్ ధాటిగా ఆడి సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండు కీలక వికెట్లు(సూర్య, పాండ్య) తీసిన హోల్టర్.. విండీస్ ను మళ్లీ పోటీలోకి తెచ్చాడు. పాండ్య(19) రన్స్ కి ఔటయ్యాడు. కానీ అక్షర్ తో కోఆర్డినేషన్ లోపించి శాంసన్(12) రనౌట్ అయ్యాడు. కైల్ మయర్స్ అద్భుతమైన త్రో తో శాంసన్ వెనుదిరగాల్సి వచ్చింది. కీలక సమయంలో సిక్సర్ బాది ఆశలు రేపిన అక్షర్ సైతం(13) నిరాశపరిచాడు. 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అర్షదీప్(12), కుల్దీప్(3) ఔటవడంతో భారత్ పోరాటం ముగిసింది. హోల్టర్, షెఫర్డ్, మెకాయ్ 2 వికెట్ల చొప్పున.. హోసెన్ 1 వికెట్ తీసుకున్నాడు. జేసన్ హోల్టర్(2/19) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సొంతం చేసుకున్నాడు.
Bad luck