యాదాద్రి కలెక్టర్ గా పనిచేసి అక్కణ్నుంచి ఆకస్మికంగా ట్రాన్స్ ఫర్ అయిన IAS అధికారి పమేలా సత్పతి(2015 బ్యాచ్)కి ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఆమెను మున్సిపల్ డైరెక్టర్ గా నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు బాధ్యతలు(FAC) నిర్వర్తిస్తున్న సుదర్శన్ రెడ్డి స్థానంలో పమేలా సత్పతి బాధ్యతలు చేపడతారు. పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ రిటైర్డ్ కావడంతో ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డికి తాత్కాలికంగా బాధ్యతలు కట్టబెట్టారు. యాదాద్రి కలెక్టర్ గా రిలీవ్ అయిన వెంటనే ఆమెకు మున్సిపల్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ పోస్టు దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ నుంచి ఆమెను ఆకస్మికంగా తప్పించడంతో పుకార్లు షికార్లు చేశాయి. భూముల వ్యవహారంలో లీడర్లకు అనుకూలంగా వ్యవహరించనందుకే ఆమెను ఉన్నట్లుండి ట్రాన్స్ ఫర్ చేశారని వార్తలు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కొందరు పట్టుబట్టి ఆమెను అక్కణ్నుంచి పంపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆమెకు మళ్లీ కీలక బాధ్యతలు అప్పజెపుతూ నిర్ణయం తీసుకుంది.
వెయిటింగ్ లో ఉన్న 2012 బ్యాచ్ కు చెందిన మరో IAS డి.కృష్ణభాస్కర్ ను పరిశ్రమల(Industries) శాఖ డైరెక్టర్ గా సర్కారు నియమించింది. ఇ.వి.నర్సింహారెడ్డి(FAC) స్థానంలో కృష్ణభాస్కర్ ఛార్జ్ తీసుకుంటారు.