వరద నష్టంపై చర్చ జరుగుతున్న వేళ అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. వరదల వల్ల రాష్ట్రంలో భారీ విపత్తు ఏర్పడిందని, 15 లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయామని కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు తెలిపారు. దీనిపై కల్పించుకున్న మంత్రి KTR.. తప్పుడు లెక్కలు చెప్పవద్దని సూచించారు. ఏవో ఇష్టమొచ్చిన లెక్కలు పట్టుకుని అసెంబ్లీకి వస్తే ఎలా.. ఆధారాలతో సహా నిరూపించండి అంటూ సవాల్ చేశారు. శ్రీధర్ బాబు జవాబిస్తూ.. మీడియాలో వచ్చింది, పరిశీలన చేసుకోమని చెబుతున్నానన్నారు. అయినా మీరు అధికారంలో ఉన్నారు.. మీ యంత్రాంగం మీకు లెక్కలు తెచ్చిస్తుంది కదా అని గుర్తు చేశారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నంబర్ చెప్పుకుంటే పోతే ఎట్లా.. సరైన ఆధారాలు చూపాలి కదా అని అన్నారు. అనంతరం కాంగ్రెస్ సభ్యుడు.. రాష్ట్రంలో చెక్ డ్యాంల గురించి ప్రస్తావిస్తూ వాటి నిర్మాణం శాస్త్రీయంగా లేకపోవడం వల్లే అనర్ధం మరింత పెరగడానికి కారణమైందన్నారు.
మేము స్వయంగా నష్టాన్ని పరిశీలించామని, భారీగా ఇసుక మేటలు వేశాయన్న శ్రీధర్ బాబు… మానేరుతోపాటు చెక్ డ్యాంల వల్ల రైతులు నష్టపోయారని చెప్పడంతో ప్రశాంత్ రెడ్డి మరోసారి జవాబిచ్చారు. ఏం మాట్లాడుతున్నారు సర్… చెక్ డ్యాంలతో మంచి జరుగుతుందని కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తున్నారని, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న దిక్కుమాలిన ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బురద రాజకీయాలు మానుకోవాలి శ్రీధర్ బాబు గారూ అంటూ ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, విపత్తు ఏర్పడినప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అయినా చెక్ డ్యాంలు శాస్త్రీయబద్ధంగా లేవనడం కాంగ్రెస్ తీరుకు నిదర్శనమన్నారు. తర్వాత హరీశ్ రావు మైకు అందుకున్నారు. చెక్ డ్యాంలు వద్దంటూ శ్రీధర్ బాబు అంటారని కలలో కూడా ఊహించలేదని చెప్పడంతో కాంగ్రెస్ నుంచి నిరసన వ్యక్తమైంది. భట్టివిక్రమార్క కల్పించుకుని మంత్రుల తీరును తప్పుబట్టారు. ఇలా అటు శ్రీధర్ బాబు, ఇటు ముగ్గురు మంత్రుల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.