
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల టీచర్స్ భారీ ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు. బోధన సమయాన్ని ఇతర సొసైటీల మాదిరిగా చేయడం.. గత ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TSUTF ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా గల అన్ని సంక్షేమ గురుకులాల నుంచి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు అటెండ్ అయ్యారు. టీచర్లపై మానసిక ఒత్తిడి తగ్గించి వారికి శ్రమకు తగిన వేతనం చెల్లించాలని MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్, గురుకులాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలంటూ ధర్నాకు హాజరైనవారు నినాదాలు చేశారు. GO 317 అమలుపై వివాదాలు, అభ్యంతరాలను సానుకూలంగా పరిష్కరించాలని.. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. TSUTF అధ్యక్షుడు జంగయ్య, జనరల్ సెక్రటరీ చావ రవి, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, సెక్రటరీ సింహాచలం, సీనియర్ నేత పి.మాణిక్ రెడ్డి, CITU నేత డి.జి.నరసింహారావుతోపాటు గురుకులాల ప్రతినిధులు శ్రీజన, ఎల్లయ్య, రాంబాబు, హరీందర్ రెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.