రామకోటి పేరుతో ‘ఆదిపురుష్’ ప్రెస్ మీట్
శుక్రవారం విడుదలైన ‘ఆదిపురుష్’ మూవీని ఆదివారం(3 రోజుల)వరకు కోటి మంది చూశారని నిర్మాత వివేక్ కూచిబొట్ల తెలిపారు. ట్రోల్స్ ద్వారా నెగెటివ్ ప్రచారం నడుస్తున్నా థియేటర్లలో కోటి మంది చూడటమే రామకథకు నిదర్శనమన్నారు. విపరీతమైన ట్రోల్స్ ఉంటున్నా కోటి మార్క్ దాటినందుకు రామకోటి ఉత్సవం పేరిట ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. రామనామాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలన్న ఉద్దేశంతోనే మూవీ తయారైంది.. ట్రోల్స్ చేస్తున్నవారే రాముడిని పరోక్షంగా తలచుకుంటూ పుణ్యం పొందుతున్నారని నిర్మాత అన్నారు. ఇంతటి స్థాయిలో వసూళ్లు చూస్తేనే సినిమా ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందన్నారు. ఈతరం పిల్లలకు అర్థమయ్యేలా సినిమా తీయాలనుకున్నాం.. ఎవరి భావాలు వారికుంటాయి.. దానికి తగ్గరీతిలో ‘ఆదిపురుష్’ తీశాం.. ఇదే పూర్తిస్థాయి రామాయణం అని చెప్పట్లేదు.. దర్శకుడు ఓం రౌత్ ను తప్పుపట్టొద్దని కోరారు.
ఈ తరం హుషారు…
ఈ నాటి పిల్లలకు హాలీవుడ్ హీరోలు తెలుసు.. కానీ జాంబవంతుడు, అంగదుడు వంటి వీరులు తెలియదు.. ఈ ‘ఆదిపురుష్’ సినిమా ద్వారా వారందరి గురించి పిల్లలతోపాటు యువత నేర్చుకుంటోంది. ‘ఆదిపురుష్’ చాలాకాలం పాటు థియేటర్స్ లో ఆడుతుంది అని నిర్మాత వివరించారు.