‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. అమ్మా తెలంగాణమా’ అంటూ ఉర్రూతలూగించిన గొంతు మూగబోయింది. ఉద్యమ పాటలకు సూరీడుగా నిలిచి ఎంతోమందిని తట్టి లేపి, గుండెల్లో గూడు కట్టుకున్న గద్దర్(74) కన్నుమూశారు. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 10 రోజుల క్రితం గుండెపోటుతో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు కాగా.. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1949లో తూప్రాన్ లో జన్మించిన గద్దర్.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చిన గద్దర్.. నకిలీ ఎన్ కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదివిన పాటల కెరటం.. 1975లో కెనరా బ్యాంకులో క్లర్కుగా చేరి 1984లో రాజీనామా చేశారు. 1997లో ఆయనపై హత్యాయత్నం జరగ్గా.. 2004లో నక్సల్స్ తరఫున ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు.
‘సూర్యుడు’, ‘చంద్రుడు’, ‘వెన్నెలే’ పిల్లలు…
ప్రకృతిని ఆవాహనం చేసుకున్నారా అన్నట్లు, సృష్టికి మూలాధారమైన సూర్యుడు, చంద్రుడిని తన పిల్లలకు పేర్లుగా పెట్టారు. అలా ముగ్గురు పిల్లలకు సూర్యుడు, చంద్రుడు, వెన్నెలగా నామకరణం చేశారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించగా.. మలి దశ ఉద్యమానికి గొంతుకై నిలిచారు. ‘నీ పాదం మీద పుట్టమచ్చనై చెల్లెమ్మా’ సాంగ్ కు నంది అవార్డు వరించింది. కానీ ఆ అవార్డును గద్దర్ తిరస్కరించారు. ‘మా భూమి’ సినిమాలో ‘బండెనక బండికట్టి’ పాట పాడటమే కాకుండా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. 1985లో జన నాట్య మండలికి పురుడు పోసి దాని వ్యవస్థాపకుల్లో(Founders) ఒకరుగా నిలిచారు. ప్రజా యుద్ధనౌకగా పేరు తెచ్చుకున్న ఆయన.. శరీరంలో తూటాతోనే చాలాకాలం నెట్టుకొచ్చారు.