తొలి టీ20లో విజయం సాధించిన వెస్టిండీస్.. రెండో మ్యాచ్ లోనూ సత్తా చాటింది. పొట్టి ఫార్మాట్ లో పటిష్ఠంగా కనిపించిన భారత్ ను వరుసగా రెండోసారి ఓటమి పాలు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాండ్య సేనను 20 ఓవర్లలో 152/7కు కట్టడి చేసి, 18.4 ఓవర్లలో 155/8 రన్స్ సాధించి 2 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలి మ్యాచ్ లో నిలిచిన తిలక్ వర్మ(51; 41 బంతుల్లో 5×4, 1×6) ఈ మ్యాచ్ లోనూ మరోసారి ఒంటరి పోరాటం చేశాడు. అండగా నిలిచేవారే లేకపోవడంతో టీమ్ ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇషాన్ కిషన్(27), గిల్(7), సూర్యకుమార్(1), సంజు శాంసన్(7), పాండ్య(24) ఇలా అందరూ ఒకరి వెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు. షెఫర్డ్, హోసేన్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
153 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన కరీబియన్ జట్టు సైతం ఆరంభంలో తడబడింది. బ్రెండన్ కింగ్ సున్నాకే వెనుదిరగ్గా, మరో ఓపెనర్ కైల్ మయర్స్(15), జాన్సన్ ఛార్లెస్(2) త్వరగానే ఔటయ్యారు. కింగ్, ఛార్లెస్ ను కెప్టెన్ హార్దిక్ పాండ్య ఔట్ చేశాడు. 32 రన్స్ కే 3 వికెట్లు పడ్డ జట్టును నికోలస్ పూరన్(67; 40బంతుల్లో 6×4, 4×6) ఆదుకున్నాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లోనే పూరన్ 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 50 పరుగులు కంప్లీట్ చేశాడంటే బౌలర్లపై ఆధిపత్యం ఎలా ప్రదర్శించాడో అర్థమవుతుంది. ఇక విండీస్ జట్టు కేవలం 69 బంతుల్లోనే(11.3 ఓవర్లు) 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. 126 రన్స్ వద్ద ఈ విధ్వంసక ప్లేయర్ ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. మరో రెండు పరుగులు స్కోర్ బోర్డుపై చేరాయో లేదో షెఫర్డ్, హోల్డర్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఆ వెంటనే హెట్ మయర్(22) కూడా ఔటయ్యాడు.
126/5తో పటిష్ఠంగా కనిపించిన విండీస్.. 129/8కి చేరుకుంది. దీంతో భారత జట్టులో గెలుపు ఆశలు కనిపించాయి. కానీ అకిల్ హోసేన్(16), జోసెఫ్(10) తొమ్మిదో వికెట్ కు 26 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో పాండ్య 3, చాహల్ 2 వికెట్లు తీయగా అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. నికోలస్ పూరన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. వరుసగా రెండో గెలుపును సొంతం చేసుకున్న వెస్టిండీస్.. 5 మ్యాచ్ ల సిరీస్ లో 2-0 లీడ్ లో ఉంది.