కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్ మెంట్ లో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరగ్గా.. మరికొంతమందికి ప్రమోషన్ లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 64 మంది అధికారులకు పోస్టింగ్ లు కట్టబెట్టగా అందులో 24 మంది డిప్యూటీ కమిషనర్లు, మరో 40 అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారు. డిప్యూటీ కమిషనర్లుగా పి.నయనార్ సరూర్ నగర్ కు.. టి.శ్రీనివాస్ ఆదిలాబాద్ కు.. వై.శ్రీల ADC హైదరాబాద్ రూరల్ కు.. కె.గీత మాదాపూర్ కు.. జి.లావణ్య అబిడ్స్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు.
ప్రమోషన్లు ఇచ్చినా పోస్టింగుల్లేవ్
వాణిజ్య పన్నుల శాఖలో చివరిసారిగా 2018లో ట్రాన్స్ ఫర్స్ అయ్యాయి. అప్పట్నుంటి ఐదేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కొందరికి రెండేళ్ల క్రితం ప్రమోషన్లు ఇచ్చారు. కానీ పోస్టింగ్ లు ఇవ్వకపోవడంతో పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ప్రమోషన్ వచ్చిన ఆనందం పొందాలో, పాత స్థానాల్లో కొనసాగుతున్నామని బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి గ్రూప్-2 ద్వారా 146 మంది ACTOలుగా ఉద్యోగాలు పొందారు. వాస్తవానికి వీరు ఆరు నెలల పాటు ట్రెయినీ(Trainee)లుగా పనిచేయాలి. కానీ పోస్టింగ్స్, ట్రాన్స్ ఫర్స్ లేకపోవడమో లేదా సర్దుబాటు కాకపోవడం వంటి కారణాలతో మూడున్నరేళ్ల పాటు అంటే ఇంకా ట్రెయినీలుగానే కొనసాగుతున్నారు. ఈ 146 మందిలో కేవలం 50 మందికి మాత్రమే కొంతకాలం క్రితం బదిలీ అవకాశం దక్కింది. అదీ 317 జీవో ఆధారంగా వీరిని పాత స్థానాల నుంచి కొత్త ప్రాంతానికి పంపించారు. కానీ మిగతా 96 మంది ఇంకా ఎదురుచూపులతోనే కాలం గడుపుతున్నారు. ఆరు నెలల ట్రెయినింగ్ కు బదులు మూడున్నరేళ్లుగా అలాగే కొనసాగుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ తాజా బదిలీలతో ఇప్పటికైనా తమకు మోక్షం కలిగిందని ఊపిరి పీల్చుకుంటున్నారు.