రెచ్చగొట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు వికృతానందాన్ని పొందారని అంగళ్లు, పుంగనూరు ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ రెండు చోట్ల జరిగిన దాడుల ద్వారా అల్లర్లు సృష్టించి అరాచకాలకు పాల్పడ్డారని, రాష్ట్రం తగలబడాలని పుంగనూరు నుంచే ప్లాన్ చేశారని ఫైర్ అయ్యారు. దీనిపై పెద్ద కుట్ర దాగి ఉందన్న సజ్జల… TDP కార్యకర్తలు ఉన్మాదుల్లా ప్రవర్తించారన్నారు. చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని అంగళ్లుతోపాటు చిత్తూరు జిల్లా పుంగనూరులో భారీ స్థాయిలో అల్లర్లు జరిగాయి.
A1గా చంద్రబాబు
ఈ ఘటనలపై నమోదైన కేసుల్లో చంద్రబాబును A1గా పేర్కొంటూ పోలీసులు FIR నమోదు చేశారు. A2గా దేవినేని ఉమా మహేశ్వర్ రావు, A3గా అమర్ నాథ్ రెడ్డిని చేర్చారు. మారణాయుధాలు, ఇటుకలు, కర్రలతో దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేశారని FIRలో నోట్ చేశారు. ఈ రెండు ఘటనల్లో 245 మందిపై కేసులు నమోదు చేయగా.. అందులో 74 మందిని అరెస్టు చేశారు.