ఆదిలాబాద్ జిల్లా కమలం పార్టీ లీడర్ల మధ్య కస్సుబుస్సు కనిపిస్తోంది. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ తోపాటు మాజీ ఎంపీపై ప్రస్తుత ఎంపీ సోయం బాపూరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివాసీ బిడ్డనైన తన ఎదుగుదలను ఓర్వలేకే… ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంతానికి వాడుకున్నానంటూ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ తనను బ్లేమ్ చేస్తున్నారని ఆవేదన చెందారు. తన మాటలను తప్పుగా ప్రచారం చేయడంతోపాటు, వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బద్నాం చేస్తున్నారన్నారు. నిధుల్ని వాడుకున్నట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
పార్టీ మారతారంటూ…
ఒకసారి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మరోసారి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు తనపై అసత్య ప్రచారం చేస్తూ, జిల్లాలో గందరగోళం సృష్టిస్తున్నారని సోయం మండిపడ్డారు. వీరి ఆగడాలు భరించలేకే ఎన్ఆర్ఐ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారన్నారు. తనను బద్నాం చేస్తున్న ఇద్దరు లీడర్లపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కు మరోసారి కంప్లయింట్ ఇస్తానన్నారు.