కారు అద్దాలు దించి రాజకుమారుడు ఇప్పుడిప్పుడే ప్రజల సమస్యలు చూస్తున్నారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కష్టాలు చూస్తే బాధగా ఉందని, I.N.D.I.A. కూటమి దుకాణానికి కూడా త్వరలోనే తాళం పడుతుందన్నారు. ఆ రాజకుమారుడు ఇప్పుడిప్పుడే జనాల్లో తిరుగుతూ సమస్యలున్నాయని అనుకుంటున్నారని.. కానీ 50 ఏళ్లు పాలించింది వాళ్ల రాజవంశమే అన్న విషయం తెలియనట్లుందంటూ చురకంటించారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. ఈ మూడు రోజుల్లో విపక్షాలు వ్యవహరించిన తీరు, రాహుల్ గాంధీ మాటలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.
మూడు రంగుల జాతీయ జెండాను పార్టీ జెండాగా వాడుకుంటూ ఒక పెద్ద పేరుతో దేశాన్ని పాలించారని విమర్శించారు. వారసత్వ రాజకీయాలు చేసేవాళ్లకు కాలం చెల్లిపోయిందని, 400 సీట్ల నుంచి 40 సీట్లకు వచ్చిన ఘనత హస్తం పార్టీదని మోదీ అన్నారు. అయితే ప్రధాని మాట్లాడుతుండగానే విపక్షాల MPలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. కొద్దిసేపు ప్రధాని మాటలకు అభ్యంతరం తెలిపిన సభ్యులు చివరకు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.