పరుగుల పందేరంలో ఎవరు ముందడుగేస్తే వారిదే విజయం. మరి ఎన్నికల పందేరంలో ఎవరి వ్యూహాలు అడ్వాన్స్డ్(Advanced)గా ఉంటాయో వారే గెలుపు శిఖరాలకు చేరుకుంటారు. మామూలు రోజుల సంగతి అటుంచితే.. అసలే ఇప్పుడు ఎన్నికల కాలం. మరో మూణ్నాలుగు నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీలకు, మరో 8 నెలల్లో పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు వేసే ప్రతి అడుగూ ఎంతో కీలకమే. గత నెల రోజుల రాజకీయాలు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. NDA కూటమికి చెక్ చెప్పడానికి విపక్షాల ఐక్య కూటమి I.N.D.I.A. ఏర్పాటుతో రాబోయే ఎన్నికలకు కొత్త అడుగు పడ్డట్లయింది. ఇక ఆ దిశగానే అన్నట్లు విపక్షాల ఐక్యతపై ఇప్పటివరకు రెండు సార్లు మీటింగ్ లు జరిగాయి. మరోవైపు BJP పార్లమెంటరీ పార్టీ సైతం రెండు సార్లు భేటీ అయింది. మోదీని ఎదుర్కోవడంలో అపోజిషన్ పార్టీల ఐక్యత ఎలా ఉన్నా.. విపక్షాలకు చెక్ పెట్టడంతో BJP మాత్రం మోదీనే నమ్ముకుంది. I.N.D.I.A. కూటమి సమావేశం ముగిసిన మరుసటి రోజే అటు NDA భేటీ జరిగింది. మీకు 28 పార్టీలు ఉంటే మాకు 36 పార్టీలు ఉన్నాయని BJP విస్తృత ప్రచారం నిర్వహించింది.
ఇంటర్నల్ మ్యాటర్ అలా ఉంచితే ప్రధాని అభ్యర్థిత్వంపై లుకలుకలు ఉన్నాయన్న ప్రచారం I.N.D.I.A.లో మొదలైంది. రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్.. ఇలా పలు పార్టీల నుంచి ప్రధాని అభ్యర్థిత్వంపై పోటీ ఉందని, వారిలో వారికి సఖ్యత లేదన్న ప్రచారం జరిగింది. బెంగళూరు మీటింగ్ తర్వాత మీడియాతో నితీశ్ మాట్లాకపోవడం, భేటీకి పవార్ వచ్చి రానట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిచ్చింది. దీనికితోడు కండిషన్ తోనే భేటీకి కేజ్రీవాల్ అటెండ్ అయ్యారు. దిల్లీ సర్వీసుల బిల్లుకు మద్దతిస్తామంటేనే వస్తామనడం, కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేజ్రీవాల్ మీటింగ్ కు వచ్చారు. కానీ ఆ తర్వాత కూటమి నుంచే తప్పుకున్నారు. మణిపూర్ అంశంపై విపక్ష కూటమి మోదీని టార్గెట్ చేసుకోవాలని చూడగా.. విపక్షాలనూ ఆయన మాత్రమే టార్గెట్ చేసుకున్నట్లు అనిపించింది. అడపదడపా అమిత్ షా సహా మంత్రులు మాట్లాడినా మోదీ ఎదురుదాడే అట్రాక్షన్ గా నిలిచింది. మోదీని మాట్లాడించి ఇరుకున పెట్టాలని భావించిన విపక్షాలు.. అవిశ్వాస తీర్మానంతోనే అది సాధ్యమని నమ్మాయి. కానీ ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ సహా ఆ పార్టీలు.. నిజంగానే BJPని ఇరుకున పెట్టాయా అన్నది క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది.
ఈ 3 రోజుల్లో జరిగిన పరిణామాలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. అవిశ్వాసంపై చర్చను మొదలుపెట్టిన గౌరవ్ గొగొయ్ కొన్నిసార్లు గట్టిగానే మాట్లాడారు. ఇక నెక్ట్స్ రాహుల్ వంతు. కోర్టు కేసుపై ‘స్టే’తో మళ్లీ సభలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్ పై I.N.D.I.A. కూటమి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ రాహుల్ మాత్రం మోదీనే లక్ష్యం చేసుకుని భారతమాత అంటూ కామెంట్స్ చేశారు. మోదీయే భారత్ అన్నట్లుగా ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. భరతమాత అంటూ కామెంట్ చేయడంపై విపక్షాల్లోని సభ్యులు కూడా పూర్తిగా హర్షించలేని స్థితి ఏర్పడింది. ఈనెల 9న మరో పరిణామం చోటుచేసుకుంది. స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా రాహుల్ ప్రవర్తన వివాదాస్పదమైంది. తనకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడంటూ స్మృతి ఆరోపించడంతో దుమారానికి కారణమైంది. ఇలా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనుకున్న పరిస్థితుల్లో రాహుల్ వ్యాఖ్యలే అవిశ్వాసం కన్నా అత్యంత అట్రాక్షన్ గా నిలిచాయి.
మొత్తానికి రాహుల్ కు, మోదీకి ఒకటే డిఫరెన్స్. వ్యక్తులు, దేశం పేర్లను లక్ష్యంగా చేసుకుంటూ రాహుల్ విమర్శలు చేస్తే.. ప్రధాని మోదీ మాత్రం పేర్లు ప్రస్తావించని రీతిలో వ్యక్తులు, కుటుంబం, పార్టీల పేరు మీద కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. మణిపూర్ పై అవిశ్వాసం పెడితే చివరకు ఆ పేరే చర్చకు రాకుండా పోయింది. ప్రధాని మాట్లాడాలని పట్టుబట్టిన విపక్షాలు.. చివరకు PM స్పీచ్ ఇస్తుండగానే బయటకు వెళ్లిపోయాయి. అటు విపక్షాలు అడిగినట్లు మణిపూర్ పై వివరణకు బదులు 3 రోజులు సభ సాగిన తీరుపైనే మోదీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మణిపూర్ పైనే చర్చ జరగాలని తీర్మానించినా.. సభలో మాత్రం ఆ అంశం కేవలం ప్రస్తావన గానే మిగిలిపోయింది. మణిపూర్ పై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చుకోలేని పరిస్థితి రెండు ప్రధాన పార్టీలకు ఏర్పడింది. ఇలా మూడు రోజుల పాటు సాగిన చర్చలో మణిపూర్ అంశం ప్రాధాన్యతను కోల్పోయి పార్టీల ఆధిపత్య ధోరణిని బయటపెట్టింది. సభను ఫాలో అయిన వారికైతే ఒక క్లారిటీ వచ్చినట్లే కనపడుతున్నది. ప్రస్తుతానికి ఏ పార్టీకి ఆ పార్టీ జబ్బలు చరచుకుంటున్నా.. రానున్న ఎన్నికల్లో ఈ పరస్పర విమర్శనాస్త్రాలు కీలకం కాబోతున్నాయన్నది సుస్పష్టమని చెప్పక తప్పదు.