ఆగస్టు నెలలో విపరీతమైన పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 ను వాయిదా వేయాలన్న పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ నెలలో 21 పరీక్షలు ఉన్నాయని ఇన్ని ఎగ్జామ్స్ నడుమ గ్రూప్-2 ఎలా రాయగలుగుతామంటూ పలువురు అభ్యర్థులు ఈ నెల 10న పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. TSPSCకి ప్రశ్నలు సంధించింది. గ్రూప్-2 పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు చేశామన్న TSPSC… 1,535 ఎగ్జామ్ సెంటర్స్ రెడీగా ఉన్నాయన్నారు. ఈ ఎగ్జామ్స్ కి 5 లక్షల మంది అప్లయ్ చేసుకుంటే అందులో అందరూ అన్ని పరీక్షలు రాయడం లేదని కోర్టుకు వివరించింది. కేవలం 150 మంది మాత్రమే పిటిషన్ వేశారని TSPSC న్యాయవాది చెప్పడంతో.. అందరూ కేసు వేయరు కదా అని కోర్టు ప్రశ్నించింది.
అయితే దీనిపై సోమవారం వరకు గడువు కావాలని TSPSC తరఫు లాయర్ కోర్టును అభ్యర్థించారు. TSPSCని సంప్రదించి నిర్ణయాన్ని సోమవారం చెప్పగలమని, అంతవరకు గడువు ఇవ్వాలన్న న్యాయవాది అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో కేసు విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.