ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో RTC.. లేటెస్ట్ ఫీచర్లతో కూడిన బస్ ట్రాకింగ్ యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ నకు ‘గమ్యం’గా పేరు పెట్టిన సంస్థ.. హైదరాబాద్ MGBSలో లాంఛనంగా దీన్ని ప్రవేశపెట్టింది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే RTC బస్సుల ఇన్ఫర్మేషన్ అంతా పొందవచ్చని సంస్థ MD సజ్జనార్ ప్రకటించారు. MGBSలో ఆయన అధికారులతో కలిసి దీన్ని ప్రారంభించడంతోపాటు లోగోను ఆవిష్కరించారు. బస్సు ఎక్కడుంది, ఎప్పుడొస్తుంది.. అన్న సందేహాలు లేకుండా ఎప్పటికప్పడు బస్సుల పొజిషన్ ను ట్రాకింగ్ ద్వారా తెలుసుకునే వెసులుబాటును RTC కల్పించింది. ప్రస్తుతానికి సంస్థకు చెందిన 4,170 బస్సులకు ఈ ట్రాకింగ్ యాప్ ను అనుసంధానం చేశారు. హైదరాబాద్ లోని పుష్పక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకూ ట్రాకింగ్ ఫెసిలిటీ ఉంది. అన్ని జిల్లాల్లోనూ పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ యాప్ ను లింక్ చేశారు. ‘TSRTC Gamyam’ పేరుతో గల ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అటు ‘www.tsrtc.telangana.gov.in’ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా
బస్సుల్లో జర్నీ చేసే మహిళల సెక్యూరిటీ కోసం TSRTC.. వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. ‘ఫ్లాగ్ ఏ బస్’ పేరిట సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. రాత్రి సమయాల్లో బస్ స్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు. యాప్ లో డీటెయిల్స్ ఎంటర్ చేయగానే స్క్రీన్ పై గ్రీన్ లైట్ కనపడుతుంది. ఆ లైట్ ను డ్రైవర్ వైపు చూపించగానే బస్సును ఆపేలా ఫీచర్ తయారైంది. ఇది రాత్రి 7 నుంచి పొద్దున 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని RTC అధికారులు తెలిపారు. యాప్ నుంచే నేరుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. డయల్ 100, 108కు ఈ యాప్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎమర్జెన్సీ సిట్యుయేషన్ లో SOS బటన్ ద్వారా కాల్ సెంటర్ ను సంప్రదించవచ్చు. బ్రేక్ డౌన్, మెడికల్ ఫెసిలిటీ, రోడ్ యాక్సిడెంట్స్ వంటి వాటిపై ఈ యాప్ ద్వారా కంప్లయింట్ చేసే అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది.