అర్థ శతాబ్దం క్రితమే అగ్రరాజ్యాలు అడుగుపెట్టిన ప్రాంతం చంద్ర మండలం. సుమారు 50 ఏళ్లనాడు అడుగుపెట్టినా అక్కడ ఏమున్నాయో కనుక్కోలేని దేశాలు.. నీటి జాడలున్నాయన్న ఇండియా డిస్కవరీతో ఒక్కసారిగా తేరుకున్నాయి. 2005 వరకు స్తబ్ధుగా ఉన్న చంద్రమండల యాత్రకు.. చంద్రయాన్-1 ప్రయోగంతో మళ్లీ రెక్కలొచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అగ్రరాజ్యాలు.. చంద్రునిపై చూపు సారించాయి. 50 ఏళ్లనాడే అడుగుపెడితే 2005 వరకు ఎందుకు పట్టించుకోలేదు.. గత దశాబ్ద కాలం నుంచే ఎందుకీ హడావుడి మొదలైంది.. అంటే దీని వెనుక చాలా కారణాలున్నాయి. జాబిల్లిపై కాలు మోపిన చరిత్రను దక్కించుకుంది అమెరికా, రష్యా అయితే.. చంద్రుని వెనుక గల గూడుపుఠాణీని బయటపెట్టింది భారతదేశం. అక్కడకు వెళ్లి వచ్చిన రెండు పెద్ద దేశాలు.. చంద్రుని వల్ల కలిగే లాభాల్ని గుర్తించలేకపోయాయి. కానీ 2008లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1తో జాబిల్లి మర్మం బయటకి తెలిసింది. చందమామపై నీరు ఉందని తొలిసారిగా కనుగొన్నది మన ఇండియా. చంద్రుని ఉపరితలమంతటా హైడ్రాక్సిల్ అణువులు(Hydroxyl Molecules) వ్యాపించి ధ్రువాల వద్ద కేంద్రీకృతమై ఉన్నట్లు చంద్రయాన్-1 నిర్ధారించింది.
చంద్రమండలం యాత్రనా… ఇప్పుడెందుకు… ఎప్పుడో వెళ్లొచ్చాయి కదా అమెరికా, రష్యా..! దానివల్ల లాభం లేనందువల్లే ప్రయోగాలకు దూరంగా ఉన్నాయి.. ఇప్పుడు ఇండియా టూర్ ఎందుకు పనికొస్తుంది.. అనవసరంగా డబ్బు వృథా..! ఇదీ 2005కు ముందు భారత్ పరిస్థితి. కానీ మన శాస్త్రవేత్తల ముందుచూపు ఏపాటిదో మనవాళ్లేగాక అగ్రరాజ్యాలకు ఆలస్యంగా తెలిసివచ్చింది. చంద్రుని ఉపరితలంపై నీరుందని ప్రకటించగానే ఒక్కసారిగా అవి ఆగమాగమయ్యాయి. శ్వేతవర్ణంతో అందంగా కనిపిస్తూ అందరి మనసు దోచుకునే జాబిల్లి… ఇండియా ప్రయోగంతో తన సిగలో దాచుకున్న నిక్షేపాల గురించి అగ్రదేశాల దృష్టి పడేలా చేసుకుంది. 47 ఏళ్ల అనంతరం రష్యా సైతం ఈ వారంలో చంద్రుని వ్యోమనౌక స్టార్ట్ చేసింది. 2030కి ముందే జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి తమ ఆస్ట్రొనాట్స్ ని పంపుతామని అమెరికా, చైనా ప్రకటించాయి. రెండు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్న భారత్.. అదే 2 రోజుల్లో తన ల్యాండర్ ని చంద్రునికి కేవలం 100 కిలోమీటర్ల రేంజ్ కు పంపుతోంది.
ఇవన్నీ ఇలా ఉంటే.. ఇంకా ఏమున్నాయక్కడ..? అపార ఖనిజ నిక్షేపాలున్నాయి. నీరు, హైడ్రోజన్, ఆక్సిజన్, హీలియం.. ఇవన్నీ భూమి సహా ఏ గ్రహంపై లేనంత స్థాయిలో ఉన్నాయట. నీరు మానవ జీవితానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రువంలోని పర్వత శిఖరాల్లో నీరు ఉందని మన సైంటిస్టులు గుర్తించారు. భారత్ చెప్పినదాన్ని నిర్ధారించుకున్న రష్యా.. లూనా-25ను ప్రయోగించి మరీ నీటి జాడల్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక హీలియం-3 అనేది హీలియానికి సంబంధించిన ఐసోటోప్. ఇది భూమిపై అరుదు కాగా.. చంద్రునిపై మిలియన్ టన్నుల్లో ఉందని NASA తెలిపింది. ఈ ఐసోటోప్ ఫ్యూజన్ ను అణుశక్తి తయారీకి రియాక్టర్లలో వాడుకోవచ్చు. యురేనియం ద్వారా నడిచే రియాక్టర్లు హయ్యెస్ట్ డేంజరస్ కాగా హీలియంతో నడిచేవి పూర్తి పర్యావరణంతో కూడినవి. హీలియం రియాక్టర్లు ప్రమాదకర వ్యర్థాలను ప్రొడక్ట్ చేయకపోవడం వల్ల ఎలాంటి రేడియోధార్మికత వెలువడే అవకాశం లేదన్నది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మాట.
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, లేటెస్ట్ టెక్నాలజీలో వాడే అరుదైన ఎర్త్ మెటల్స్(Earth Metals) అయిన స్కాండియం, ఎట్రియంతోపాటు 15 రకాల శ్వేతధాతు లోహాలు(Lanthanides) ఉన్నట్లు గుర్తించారు. ఇంతటి అపార సంపదపైనే ఇప్పుడు అందరి దృష్టీ పడింది. చంద్రునిపై సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడి నీటితో మానవులు దీర్ఘకాలంగా నివాసం ఉండొచ్చని తేలింది. అగ్రరాజ్యాలు ఇంతలా ఉబలాటపడుతున్నా కొన్ని రూల్స్ వాటికి అడ్డుకట్ట వేస్తున్నాయి. UNO 1966 ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం చంద్రుడిపై ఏ దేశానికి సార్వభౌమాధికారం లేదు. ఖగోళ వస్తువుల సేకరణ లేదా అంతరిక్ష అన్వేషణ ఏదైనా అన్ని దేశాల ప్రయోజనాల కోసం మాత్రమే జరగాలి. 1979 మూన్ అగ్రిమెంట్ ప్రకారం చంద్రుని ఏ భాగమూ ఒక రాష్ట్రానికో లేదా ఇంటర్నేషనల్ సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కంపెనీలకో చెందదు. ఇలాంటి రూల్స్ ఉన్నాయి కాబట్టే చంద్రునిపై సాహస యాత్రకు ఏ దేశమూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ భారత్ యాత్రతో తేరుకున్న ప్రపంచం.. ఇప్పుడు జాబిల్లిలో దాగున్న నిక్షేపాల వైపు చూస్తోంది. ఇప్పటికైనా మన శాస్త్రవేత్తల టాలెంట్ ఎలాంటిదో తెలిసివచ్చింది. ప్రపంచ దేశాలు గుర్తిస్తే గానీ మనవాళ్ల ప్రతిభ మనకు తెలియకుండా పోయిందన్నది జగమెరిగిన సత్యం. చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ గా జాబిల్లిపై అడుగుపెడితే మరెన్ని నిజాలు తెలుస్తాయోనన్న ఉత్కంఠ నెలకొనడం సహజమే మరి.