బాలికలను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ OSD హరికృష్ణను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అమ్మాయిలపై వేధింపులు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సైతం స్పందించాడు. అసలే స్పోర్ట్స్ కు అంతంత మాత్రంగానే ఆదరణ ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. లేకపోతే ఫ్యూచర్ లో వారు ఆటలు ఆడేందుకు ఇష్టపడబోరని, తల్లిదండ్రులు సైతం ఆలోచిస్తారన్నారు. అటు వార్తలు రావడం, ఇటు గోపీచంద్ రెస్పాండ్ కావడంతో.. ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. ఘటనపై విచారణకు ఆదేశించామని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న OSD హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో దీనిపై విచారణ పూర్తి చేస్తామని, ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ పై యాక్షన్ తీసుకోవాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. ఇక్కడా ఆరోపణలు రుజువైతే జైలుకు పంపిస్తాం, అవసరమైతే ఉరి తీయిస్తామంటూ మంత్రి స్పష్టం చేశారు.