అభ్యర్థుల డిమాండ్ మేరకు గ్రూప్-2 పరీక్షల్ని వాయిదా వేసిన TSPSC.. వాటిని నవంబరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు 2, 3 తేదీల్లో పరీక్షలు జరుపుతామని ఆదివారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని జిల్లాల అధికారులతో TSPSC సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పుడు ఎగ్జామ్స్ వాయిదా పడటంతో ఇక నవంబరులో నిర్వహించే పరీక్షలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా TSPSC పేపర్ల లీకేజీ కారణంగా పరీక్షల నిర్వహణపై కొంతకాలం క్రితం అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టులో గ్రూప్-2 నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంది. కానీ అర్థంతరంగా వాటిని వాయిదా వేయాల్సి రావడంతో మరోసారి ఆ తరహా చర్యలపై దృష్టిపెట్టాలని TSPSC నిర్ణయించింది.
ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయని TSPSC తెలిపింది. వాస్తవానికి ఈ నెల 29, 30 తేదీల్లో ఎగ్జామ్స్ జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల ఆందోళన మేరకు CM ఆదేశాలతో వాటిని వాయిదా వేయాల్సి వచ్చింది. 5 లక్షల మందికి పైగా ఈ గ్రూప్-2 ఎగ్జామ్స్ కి అప్లయ్ చేసుకోగా.. వారందరికీ ఏర్పాట్లు చేసేందుకు నవంబరు వరకు సమయం సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే చాలా జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాట్లు చేసినందున వాటన్నింటినీ క్యాన్సిల్ చేసి కొత్తగా ఎగ్జామ్స్ సెంటర్లు కేటాయించేలా TSPSC అధికారులు దృష్టిసారించారు. అయితే పాతవాటినే కొనసాగిస్తారా ఏవైనా మార్పులు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.