హిమగిరుల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలకు ఎక్కడికక్కడ ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. వర్షాలకు వరద పోటెత్తి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మృతుల సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశముంది. సిమ్లాలోని శివాలయం కూలిన ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురు ఆలయ శిథిలాల కింద సమాధి అయినట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. కొండచరియలు విరిగిపడి ఎక్కడికక్కడ రోడ్లు మూసుకుపోయాయి. చాలా చోట్ల ఇళ్లు కూలడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. హిమాచల్ రాజధాని సిమ్లాలో బిల్డింగ్స్ పేకమేడల్లా నీటిలో కలిసిపోతున్నాయి. కొండచరియలు విరిగిపడి వేలాదిగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 600 పైగా రోడ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. పెద్దసంఖ్యలో జనాల్ని సేఫ్ ప్లేసెస్ కు తరలిస్తుండగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. NDRF, SDRF సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మండి జిల్లాలో బియాస్ నది ప్రమాదకర రీతిలో పొంగి ప్రవహిస్తోంది.
ఉత్తరాఖండ్ లోనూ వరదలు అల్లకల్లోలం రేపుతున్నాయి. రిషికేశ్, డెహ్రాడూన్ లో గంగానది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతినడంతో చార్ ధామ్ యాత్ర అయిన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. చార్ ధామ్ యాత్రను రెండ్రోజుల పాటు ప్రభుత్వం రద్దు చేసింది. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, రిషికేశ్ లో అలకానంద, మందాకిని, గంగానదులు ఉప్పొంగుతున్నాయి. రిషికేశ్ లో 44 సెంటీమీటర్ల భారీ వర్షపాతం(Rain Fall) రికార్డయింది.
రుషికేశ్ లో గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదతో భయంకర పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఫాగ్లి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి కూరుకుపోయిన ఐదు మృతదేహాలను బయటకు తీసినట్లు సిమ్లా SP సంజీవ్ కుమార్ తెలిపారు. మరో 17 మందిని రక్షించామన్నారు.