
కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission)కి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఎన్నడూ ఊహించని విధంగా అనూహ్య రీతిలో ఒక FIRలో ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) పేరును చేర్చడంపై కలకలం రేగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతికుమారి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పిటిషన్ ఇచ్చారు. అయినా FIR నమోదు చేయలేదంటూ పిటిషనర్ కోర్టుకు తెలపడంతో.. మంత్రితోపాటు మొత్తం 11 మందిపై వెంటనే కేసు నమోదు చేయాలని 5 రోజుల క్రితం నాంపల్లి కోర్టు ఆదేశించింది. లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందన్న వార్నింగ్ తో శ్రీనివాస్ గౌడ్ సహా మొత్తం 11 మందిపై FIR చేశారు. CEC రాజీవ్ కుమార్ తోపాటు సెక్రటరీ సంజయ్ కుమార్, గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన శశాంక్ గోయల్, రొనాల్డ్ రోస్ సహా మొత్తం 11 మంది అధికారులపై ఈనెల 12న మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది.
అయితే ఇంతకుముందెన్నడూ లేని రీతిలో తమపైనే కేసు ఫైల్ కావడంతో EC సీరియస్ గా తీసుకుంది. ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికే స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ను ఢిల్లీ పిలిపించగా.. తాజాగా CS శాంతికుమారికి సైతం CEC నుంచి పిలుపొచ్చింది. న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఈ ఇద్దరు అధికారులతో EC తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతోంది. 2018 ఎలక్షన్ల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు సమాచారం ఇచ్చారని సీహెచ్ రాఘవేంద్రరాజు పిటిషన్ వేశారు. ఎలక్షన్ అఫిడవిట్ ను ఒకసారి ROకు అందించిన తర్వాత దాన్ని వెనక్కు తీసుకుని సవరించి మళ్లీ అందజేశారంటూ పిటిషన్ దాఖలైంది.