
మూత్ర పిండాల వ్యాధి(Kidney Disease)తో ఎంతటి దారుణ అవస్థలు ఉంటాయో ఆ బాధితులకే తెలుసు. కిడ్నీలు చెడిపోతే ప్రత్యామ్నాయం(Alternative) లేని పరిస్థితి. మానవ అవయవాలు అంతకంతకూ కరవవుతున్న వాతావరణంలో కీలక పురోగతి సాధించారు డాక్టర్లు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది మూత్రపిండం అమర్చి మరో జన్మనిచ్చారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. న్యూయార్క్ యూనివర్సిటీ ట్రాన్స్ ప్లాంట్(Transplant) ఇన్ స్టిట్యూట్ కు చెందిన డాక్టర్లు ఈ ఘనత సాధించారు. గతంలోనూ పంది కిడ్నీని ట్రాన్స్ ప్లాంట్ చేసినా అది రెండ్రోజులకు మించి పనిచేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం గత నెల రోజులుగా వరాహ కిడ్నీ మాత్రం బాగా పనిచేస్తుందట. మనుషులకు జంతువుల పార్ట్స్ అమర్చడంలో ఇది కీలక ముందడుగుగా చెబుతున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన 57 ఏళ్ల వ్యక్తికి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంగీకారంతో ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఇది జరిగి ఇప్పటికే నెల రోజులు పూర్తి కాగా రెండో నెలలోనూ తమ అబ్జర్వేషన్ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ జులై 14న పంది కిడ్నీ అమర్చితే రెండ్రోజుల నుంచే మూత్రం రిలీజ్ అవుతుందని గుర్తించారు.
నిజంగా వైద్య చరిత్రలో ఇదో గ్రేట్ స్టెప్ గా భావించాలి. ఎందుకంటే మనదేశంలో కిడ్నీ వ్యాధుల బారిన పడి కోట్ల మంది అవస్థలు పడుతున్నారు. ఆల్టర్నేటివ్ లేక కేవలం డయాలసిస్ మీదే ఆధారపడటం, దాని ద్వారా క్రమంగా శరీరం కుచించుకుపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. మానవ కిడ్నీలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అది కూడా అప్లయ్ చేసుకున్న తర్వాత వస్తుందో లేదో తెలియదు. ఒక్కో కిడ్నీరేట్ రూ.20 లక్షల నుంచి రూ.కోటి దాకా పలుకుతోంది. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే వారి కిడ్నీలను బతికున్నవారికి పెడతారు. కానీ ఇందుకోసం ముందుగా ‘జీవన్ దాన్’లో అప్లయ్ చేసుకోవాలి. ఇలా అప్లయ్ చేసుకున్నా అవి దొరక్క ఏటా వేలాది మంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంది కిడ్నీల ట్రాన్స్ ప్లాంటేషన్ సక్సెస్ అయితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదేమో.