అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో గవర్నర్ కు ప్రభుత్వానికి ఇప్పటికే దూరం పెరిగిన దృష్ట్యా గవర్నర్ మరోసారి స్పందించారు. RTC బిల్లు విషయంలో రాజ్ భవన్ పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని గవర్నర్ కోరారు. తాజాగా RTC బిల్లును న్యాయశాఖకు పంపిన గవర్నర్… న్యాయశాఖ సెక్రటరీ సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని RTC ఉద్యోగులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
RTC బిల్లుతోపాటే పెండింగ్ లో పెట్టిన మిగతా బిల్లుల్ని సైతం న్యాయశాఖకు పంపినట్లు రాజ్ భవన్ తెలిపింది. గతంలో వెనక్కు పంపిన బిల్లులపై చేసిన సిఫారసుల గురించి న్యాయశాఖను వివరణ అడిగిన గవర్నర్… తన సిఫారసులను పరిగణలోకి తీసుకున్నారా లేదా స్పష్టం చేయాలని ఆదేశించారు. నిబంధనలను అనుసరించి బిల్లుల్ని న్యాయశాఖ సెక్రటరీకి పంపామని.. స్టేట్ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్, సెక్రటేరియన్ రూల్స్ కు లోబడి సిఫారసు చేసినట్లు రాజ్ భవన్ స్పష్టం చేసింది. ఇందులో కొత్తేం లేదని, ప్రతిసారి కామన్ గా జరిగేదేనని తెలిపింది.