పోలీసులపై PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదంగా మారగా.. బెట్టు చేసిన ఖాకీలు ఆయన భద్రత(Security)ను కట్ చేశారు. దీంతో ఆ ఉన్న సెక్యూరిటీ కూడా వద్దని తిప్పి పంపారాయన. మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై నిన్న రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతి చూపిస్తామంటూ హాట్ కామెంట్స్ చేయడమే కాకుండా అధికార పార్టీకి సహకరించిన ప్రతి ఒక్కరి పేర్లు రెడ్ డైరీలో రాస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు. దీన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతోపాటు రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించగా.. పలు పోలీస్ స్టేషన్లలో కొందరు ఉద్యోగులు కంప్లయింట్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. రేవంత్ పై వచ్చిన కంప్లయింట్స్ ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, భూత్పూర్ తోపాటు నాగర్ కర్నూల్ ఠాణాల్లో వివిధ సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయ్యాయి.
ఉన్న సెక్యూరిటీ కూడా వెనక్కి
తమపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున బుధవారం రాత్రి నుంచి సెక్యూరిటీ సహాయ నిరాకరణ ఎదురైంది. 2+2 సెక్యూరిటీ కలిగిన రేవంత్ రెడ్డికి 1+1కు తగ్గించి పోలీసులు డ్యూటీకి వచ్చారు. దీనిపై PCC ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ఆ సెక్యూరిటీ కూడా వద్దని తిప్పి పంపించారు. దీంతో పోలీసులు, రేవంత్ రెడ్డి మధ్య వివాదం కాస్తా మరింత ముదిరినట్లయింది.