గత రెండ్రోజుల రాష్ట్ర రాజకీయాలు పరిశీలిస్తే ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకంటూ ఒకటే ప్రచారం నడుస్తోంది. ఇక అభ్యర్థుల లిస్ట్ వచ్చినట్లేనని ఏ మీడియాకా మీడియా ఊదరగొట్టేస్తోంది. సొంతదా, ఇతరులదా అన్నది పక్కన పెడితే ప్రధాన మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఇదే హడావుడి. ఈ వార్తల్ని చూసి MLA క్యాండిడేట్లేమో గానీ.. సెగ్మెంట్లలో మాత్రం అగ్గి రాజేస్తున్నది. వాట్సప్ గ్రూపుల్లో అతనికే టికెట్ అంటే అతడికే అంటూ ఒకటే ఊదరగొట్టేస్తున్నారు. కిందిస్థాయి లీడర్లు, కార్యకర్తల హడావుడితో MLA క్యాండిడేట్లు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే హైకమాండ్ నుంచి వెలువడ్డ సంకేతాలతో చాపకింద నీరులా చల్లగా పని కానిచ్చుకుంటున్న సదరు MLAలు, అభ్యర్థులు.. ఎదుటి పార్టీపై కన్నేశారు. కానీ అక్కడా ఏమంత ఈజీగా లేకపోవడంతో ఆత్మరక్షణ(Self Defence)లో పడిపోతున్నారు. ‘ఇక్కడ కాకుంటే మరో చోట’ అన్న సీన్ ఉండేది గతంలో. కానీ ఇంతకాలం తమ పనితీరును ప్రజలు బాగా గమనించారు కాబట్టే ఉన్న పార్టీలో సీటు రావట్లేదని, ఇంకో పార్టీలోకి వెళ్లి ఏం చేస్తారులే అన్న మాటలున్నాయి. మరి ఇంతకాలం ప్రజా సమస్యల్ని మరచి సంపాదనపైనే దృష్టిపెట్టి ఎలక్షన్లు వస్తున్నాయనగానే హడావుడి చేస్తే ఎలా ఉంటది. అచ్చం.. ఇలాగే ఉంటది.
టికెట్లు ఎప్పుడు ప్రకటిస్తారా అంటూ సెగ్మెంట్లలో ఇప్పటిదాకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇక దీనిపై క్లారిటీ వచ్చేసింది. అధికార BRS మరో రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశముంది. అటు కాంగ్రెస్ సైతం సెప్టెంబరు ఫస్ట్ హాఫ్ లో పేర్లు వెల్లడించనుంది. BJP సైతం అదే పనిలో ఉంది. అందరికన్నా ముందు వెలువడే BRS టికెట్లపైనే మిగతా పార్టీల నిర్ణయాలు ఆధారపడి ఉండే అవకాశముంది. తొలిదశలో కొంతమందికి మొండిచెయ్యే ఎదురైతే హస్తం లేదా కమలం పార్టీల వైపు చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా పార్టీల్లోని ఆశావహుల(Aspirants)కు చెక్ పడుతుంది. కాబట్టి BRS టికెట్ల కేటాయింపు పైనే ప్రస్తుత పాలిటిక్స్ డిపెండ్ అయినట్లు అర్థమవుతుంది. ఇక్కడ టికెట్ లేని వారు కచ్చితంగా మిగతా రెండు పార్టీల వైపు దృష్టి పెడతారు. కాబట్టి ఆ రెండు పార్టీలు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పార్టీలో చేరినా ఇప్పటికిప్పుడు టికెట్ల కేటాయింపుపై స్పష్టమైన హామీ ఇవ్వలేని పరిస్థితి. జాయిన్ అవ్వగానే టికెట్లు ఇస్తే ఇది పెద్ద రాద్ధాంతానికి దారి తీసి అసలుకే మోసం వస్తుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఎదుటి పార్టీలో గెలవలేకే ఇందులోకొస్తే ఇక్కణ్నుంచి గెలుస్తారన్న నమ్మకమేంటన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.
మరోవైపు మిగతా పార్టీల్లోనూ సీన్ అంత ఈజీగా ఏమీ లేదు. ఇప్పటికే కాంగ్రెస్ లో 50 నుంచి 60 సీట్లకు ఫేమస్ లీడర్లే రెడీగా ఉన్నారు. మిగతా టికెట్లకు వారి అనుచరులు లేదా ముందు నుంచి పార్టీనే నమ్ముకుని రాష్ట్ర పెద్దల అండదండలతో టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ టాప్ లీడర్ల ప్లేస్ లు మినహాయిస్తే ఇప్పుడు ఎదుటి పార్టీ నుంచి వచ్చే MLA అభ్యర్థులు.. మిగిలిపోయిన సీట్ల కోసం కొట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడా పార్టీలో జాయిన్ అయినా అంత స్ట్రెయిట్ గా టికెట్ దొరుకుతుందన్నది కల అని చెప్పాల్సి వస్తున్నది. BRSకు దీటుగా అభ్యర్థుల్ని కాంగ్రెస్ రెడీ చేసుకుంటోంది. ఇక BJPలో చేరాలా వద్దా అన్న డిసిషన్ పై మల్లగుల్లాలు పడుతున్నారు మరికొందరు. కమలం పార్టీతో తమకు కలిసి వస్తుందని భావిస్తే మాత్రం అటువైపు గోడ దూకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడా ఇప్పటికే కొంతమంది క్యాండిడేట్ల పేర్లను ఫిక్స్ చేసేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పటికే ఫేమస్ గా ముద్రపడ్డ వారు తప్ప మిగతా సెకండ్ క్యాడర్ లీడర్లకు.. BJP గేటులోకి ఎంటరయినా సీటు దక్కుతుందన్నది క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోనుంది. కాబట్టి దీన్ని బట్టి తెలిసిందేంటంటే అక్కడ సీటు గోవిందా అయినా ఇక్కడ సీటు వస్తుందా అన్నది ప్రశ్నార్థకమే.