అసలు కిక్కు అంటే ఇదే. 13 రోజులు చప్పగా సాగిన ఆదాయం రాక… చివరి రెండు రోజుల్లో అమాంతం పెరిగింది. దీంతో కేవలం రెండు రోజుల్లో సర్కారుకు పెద్దమొత్తంలో డబ్బు వచ్చి చేరింది. లిక్కర్ టెండర్ల(Liquor Tenders)కు చివరి రెండు రోజుల్లో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డితోపాటు బోర్డర్ జిల్లాలైన నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ లో పెద్దసంఖ్యలో అప్లికేషన్లు దాఖలయ్యాయి. శంషాబాద్ లో 100 షాప్ లకు 3,000 వేల అప్లికేషన్లు వచ్చాయి. ఈ లెక్కన ఒక్కో వైన్స్ కు 300 అప్లికేషన్లు రావడం సంచలనంగా మారింది. అప్లికేషన్ల రూపేణా వచ్చిన ఆదాయమే రూ.6 కోట్లుగా ఉంది. ప్రభుత్వం ఆశిస్తున్న రూ.2,000 కోట్లు నిన్న పొద్దున వరకు అయోమయంగా మారగా… ఆఖరి రెండు రోజుల్లోనే అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. ఇప్పటికిప్పుడు పరిస్థితిని చూస్తే సర్కారు ఆశించినట్లు లక్ష అప్లికేషన్లకు చేరుకున్నాయి. వీటి ద్వారా రూ.2,000 కోట్లు రానుండగా.. ‘డ్రా’ అనంతరం చెల్లించే 25 శాతం డిపాజిట్ ద్వారా మరో రూ.2,000 నుంచి రూ.3,000 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఖజానా(Treasury)ని భారంగా నెట్టుకొస్తున్న తరుణంలో లిక్కర్ టెండర్ల ద్వారా సమకూరే ఆదాయం ఎంతగానో ఉపయోగపడనుంది.
రాష్ట్రంలో 2,650 లిక్కర్ షాపుల ఏర్పాటు కోసం ఈ నెల 4వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. తుది గడువు ఈ నెల 18(ఈరోజు) కాగా ఈనెల 16 వరకు నామమాత్రంగానే అంటే ఊహించినంతగా కాకుండా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దీనిపై ప్రభుత్వంతోపాటు ఎక్సైజ్ శాఖ మల్లగుల్లాలు పడింది. గతంలో కంటే 30,000 అప్లికేషన్లు ఎక్కువగా వస్తేనే ప్రభుత్వ అంచనాలు(Estimation)కు చేరుకుంటామని అబ్కారీ శాఖ భావించింది. ఈ నెల 16 వరకు 41,652 అప్లికేషన్ల ద్వారా రూ.800 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఎక్సైజ్ శాఖ ఆశించిన రూ.2,000 కోట్లలో సగం కూడా రాకపోవడంతో మల్లగుల్లాలు పడింది. పెద్ద సంఖ్యలో వ్యాపారులు రావడం వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అబ్కారీ ఆఫీసుల్లోనే స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. చివరి రెండు రోజుల్లోనే 14 రోజులకు మిన్నగా ఆదాయం రావడంతో ఎక్సైజ్ శాఖ ఊపిరి పీల్చుకుంటోంది.
బార్డర్ జిల్లాల్లో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. పొరుగు రాష్ట్రాల్లో లిక్కర్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సరిహద్దు జిల్లాల్లో భారీగా అర్జీలు వచ్చాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. గతంలో APకి తెలంగాణ నుంచే భారీగా లిక్కర్ సప్లయ్ అయింది. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు కొలువుదీరగానే లిక్కర్ రేట్లు భారీగా పెంచేశారు. దీంతో కర్ణాటక మద్యం ప్రియులు తెలంగాణ వైపు పడ్డారు. ఇక లాస్ట్ టూ డేస్ లో వచ్చిన అప్లికేషన్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా రాయలసీమ, కర్ణాటక ప్రాంతాలకు చెందిన వ్యక్తులు భారీయెత్తున అప్లికేషన్లు వేసినట్లు తెలుస్తున్నది. ఇక్కడి వ్యాపారులతో మచ్చికై పొత్తులో భాగంగా ఈ టెండర్లు దాఖలు చేశారు. ఎవరు వేస్తే ఏంది.. సర్కారుకు ఆదాయం వచ్చిందా, లేదా.. అసలు ఓనర్లు తెలంగాణోళ్లా కాదా అన్నదే ముఖ్యమన్న రీతిగా సాగుతున్నది ఎక్సైజ్ టెండర్ల తీరు.