
భారత జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు బోల్తా పడి పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. లద్దాఖ్ సమీపంలోని గార్జ్ లోయలో వాహనం పడి ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఒకరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(JCO) ఉన్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఆర్టిలరీ యూనిట్ కు చెందిన జవాన్ల బృందం.. లేహ్ లోయకు సామగ్రి తీసుకువెళ్తున్న సమయంలో వాహనం బోల్తా పడింది. 10 మందితో కూడిన ట్రక్కు కరూ గ్యారిసన్ నుంచి లేహ్ సమీపంలోని క్యారీకి వెళ్తుండగా బోల్తాపడినట్లు లేహ్ SP పి.డి.నిత్య తెలిపారు. వాహనం న్యోమా ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ అదుపు తప్పింది. దీంతో ఉన్నట్టుండి లోయలో పడిపోయింది.
అక్కడకు చేరుకున్న స్థానిక పోలీసులు జవాన్లందరినీ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. కానీ అప్పటికే 9 మంది కన్నుమూశారు. మరొకరి కండిషన్ సీరియస్ గా ఉందని అధికారులు ప్రకటించారు. జరిగిన ఘటపైన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీ సేవల్ని దేశం మరచిపోదంటూ వారి కుటుంబాలకు ట్విటర్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.