భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3కి సమాంతరంగా రష్యా సైతం లూనా-25ని రంగంలోకి దించింది. ఇండియా కన్నా ఆలస్యంగా ప్రయాణాన్ని ప్రారంభించిన రష్యా ల్యాండర్.. చంద్రయాన్-3 కన్నా ముందుగానే జాబిల్లిపై అడుగు పెట్టాలనుకుంది. రెండు ల్యాండర్లూ దక్షిణ ధ్రువంపైకే వెళ్లాల్సి ఉంది. కానీ చంద్రయాన్-3 మాత్రం ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ టూర్ కొనసాగిస్తుండగా.. లూనా-25 మాత్రం క్రాష్ అయింది. రష్యా ల్యాండర్ ఉన్నట్టుండి కుప్పకూలిపోవడానికి మెయిన్ రీజనేంటి.. రష్యా అత్యుత్సాహమే కొంప ముంచిందా.. ఆధిపత్య ధోరణి కోసం అర్రులు చాస్తూ అసలు విషయాన్ని మరచిపోయిందా.. అంతరిక్షంలోనే ఫస్ట్ టైమ్ అడుగుపెట్టిన ఘనతను మూటగట్టుకున్న దేశం ఇలా నీరుగారడమేంటి… నిజానికి ఇవన్నీ ఒక రకమైన కారణాలైతే.. మరో అతిపెద్ద కారణమూ దీని వెనుక ఉందట.
అంతరిక్ష ప్రయోగాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది ఆగమేఘాల మీద రష్యా సర్కారు మూన్ మిషన్ స్టార్ట్ చేయడానికి అసలైన రీజన్.. ఉక్రెయిన్ యుద్ధమేనట. ఇప్పటికే ఉక్రెయిన్ వార్ తో పుతిన్ సర్కారు భారీగా నష్టపోయింది. అయితే ఈ యుద్ధం ద్వారా తమ దేశానికి ఎలాంటి ఇబ్బంది కలగడం లేదన్న విషయాన్ని ప్రపంచానికి చాటడానికే లూనా ప్రయోగం చేపట్టిందట. ఈ మిషన్ ఫెయిల్యూర్ వల్ల రష్యాకు 50 నుంచి 100 బిలియన్ డాలర్లు(రూ.4,250 కోట్ల నుంచి రూ.8,200) కోట్లు నష్టం వాటిల్లింది. లూనా ల్యాండర్ సక్సెస్ అయితే ఉక్రెయిన్ పై ప్రపంచ దృష్టిని రష్యా మరల్చేందుకు ఈ ప్రయోగం చేసిందట. మరోవైపు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ మాత్రం ప్రాభవం కోల్పోలేదని చాటడానికే ఇదంతా చేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా అంటున్నది. మరోవైపు ఇది సక్సెస్ అయితే ప్రపంచ రీసెర్చ్ లో తమది అత్యుత్తమ టాలెంట్ అని తనను తాను రుజువు చేసుకోవడానికి పుతిన్ ప్రభుత్వం ప్రయత్నించేదని తేలింది.
మరి చంద్రయాన్-3 కోసం భారత్ ఖర్చు చేసింది ఎంతో తెలుసా… కేవలం రూ.613 కోట్లు. అంటే ఈ లెక్కన మూన్ మిషన్ కు భారత్ కన్నా రష్యా కేటాయించింది 10 రెట్లు ఎక్కువన్నమాట. కేవలం రష్యానే కాదు.. అమెరికా, చైనా సైతం చంద్రయాన్-3కి పోటీగా ల్యాండర్లను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించాయి. ఇక లూనా-25ను కోల్పోవడం రష్యాకు పెద్ద అవమానమని బ్రిటీష్ ఇంటెలిజెన్స్ మాజీ ఆఫీసర్ ఫిలిప్ ఇంగ్రామ్ అన్నారు. ఇది పుతిన్ కు చాలా ఇబ్బందికరమని, ఉక్రెయిన్ వార్ ను కప్పిపుచ్చడానికి యత్నిస్తే ఇలా రెండు రకాలుగా పరువు పోయిందని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా తీరుగా తానూ ప్రయత్నించి చూపాలని తపించినా.. అంతరిక్ష గేమ్ లో రష్యా చివరకు కిందకు పడిపోవాల్సి వచ్చిందని ఈ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి అన్నారు. లూనా-25 క్రాష్ ను కప్పిపుచ్చుకోవడానికి పుతిన్ ట్రై చేస్తాడని, సైన్ అండ్ టెక్నాలజీపై చర్చించడానికి బదులు అదో నార్మల్ టెక్నికల్ ప్రాబ్లమ్ అని క్రియేట్ చేయడానికి అవకాశం ఉందన్నారు.
సోవియట్ యూనియన్ పతనం తర్వాత శాస్త్రీయ పరిశోధనల్లో రష్యా సామర్థ్యాలు వేగంగా పడిపోతున్నాయని ఎక్స్ పర్ట్స్ ఊహించారు. రష్యా ప్రయత్నాలు వాణిజ్యం కంటే మిలిటరీపైనే ఎక్కువగా ఉన్నాయని, అవినీతి వల్ల లక్షలాది మందిని కోల్పోవాల్సి వచ్చిందని.. దీంతో కమర్షియల్ స్పేస్ లాంఛింగ్ వల్ల మొత్తం వాటాను పోగొట్టుకోవాల్సిన దుస్థితి ఎదురైందని అంటున్నారు. పుతిన్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన వోస్టోచ్ నీ స్పేస్ సెంటర్.. 2019లో చోరీకి గురవడం వల్ల రష్యా 100 కోట్లకు పైగా నష్టపోయింది. అయితే రష్యా మిషన్ ఫెయిలవడం మాత్రం మాస్కోపై మరింత ఎఫెక్ట్ చూపిస్తుందని స్పేస్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.